శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్.
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజాముఖపద్మ మయూఖమాలికిన్
బాల శశాంక మౌళికిఁ గపాలికి మన్మథ గర్వపర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్యమనస్సరసీరుహాళికిన్.
ఆతతసేవఁ జేసెద సమస్తచరాచర భూతసృష్టివి
జ్ఞాతకు భారతీహృదయసౌఖ్యవిధాతకు వేదరాశి ని
ర్ణేతకు దేవతానికరనేతకుఁ గల్మషజేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిలతాపసలోక శుభప్రదాతకున్.
ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతాహృదయానురాగసం
పాదికి దోషభేదికిఁ బ్రపన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేషజగజ్జననందవేదికిన్
మోదకఖాదికిన్ సమదమూషకసాదికి సుప్రసాదికిన్.
క్షోణితలంబు నెన్నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయసుందరవేణికి రక్షి తామర
శ్రేణికిఁ దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్.
పుట్టంబుట్ట, శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నాకీవమ్మ యో! యమ్మ మేల్
పట్టున్మానకుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడివుచ్చినయమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యీవుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.
హరికిన్ బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం
దురు తోఁబుట్టువు, భారతీగిరిసుతల్ తోనాడు పూఁబోఁణి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరియిచ్చున్ నిత్యకల్యాణముల్.
శారద నీరదేందుఘనసార పటీరమరాళమల్లికా
హారతుషార ఫేనరజతాచల కాశఫణీశకుందమం
దార సుధాపయోధి సితతామరసామరవాహినీశుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానగ నెన్నడుగల్గు భారతీ!
అంబ, నవాంబుజోజ్వల కరాంబుజ, శారదచంద్రచంద్రికా
డంబర చారుమూర్తి, ప్రకటస్ఫుటభూషణరత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శృతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంబర వీధివిశ్రుతవిహారి, ననుం గృపఁజూడు భారతీ!
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములుఁ గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే
సమ్మెట వ్రేటులం బడక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెర పోతరా జొకఁడు భాగవతంబు జగద్ధితంబుగన్.
చేతులారంగ శివునిఁ బూజింపఁడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువఁడేని
దయయు సత్యంబులోనుగాఁదలఁపఁడేనిఁ
గలుగనేటికిఁ దల్లులకడుపుఁజేటు.
పలికెడిది భాగవతమఁట,
పలికించువిభుండు రామభద్రుండఁట, నేఁ
బలికిన భవహరమగునఁట,
పలికెద, వేఱొండుగాథ బలుకఁగ నేలా?
ఒనరన్ నన్నయ తిక్కనాదికవు లీ యుర్విం బురాణావళుల్
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.
లలితస్కంధము, గృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతా శోభితమున్, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వల వృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.
హారికి, నందగోకుల విహారికిఁ జక్రసమీరదైత్య సం
హారికి, భక్త దుఃఖపరిహారికి, గోపనితంబినీ మనో
హారికి, దుష్టసంప దపహారికి, ఘోషకుటీపయోఘృతా
హారికి, బాలకగ్రహమహాసురదుర్వనితా ప్రహారికిన్.
శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణహస్తని
ర్మూలికి, ఘోరనీరదవిముక్తశిలాహత గోపగోపికా
పాలికి, వర్ణధర్మ పరిపాలికి, నర్జునభూజయుగ్మ సం
చాలికి, మాలికిన్, విపుల చక్రనిరుద్ధ మరీచిమాలికిన్.
క్షంతకుఁ గాళియోరగ విశాల ఫణోపరివర్తనక్రియా
రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధఘోర వాహినీ
హంతకు నింద్రనందననియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియసమంచిత భక్తజనానుగంతకున్.
న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన
స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం
ధాయికిఁ బీతవస్త్రపరిధాయికిఁ బద్మభవాండభాండ ని
ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.
శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన; భాగవతంబు సద్భక్తితోడ
వినఁగోరువారల విమలచిత్తంబులఁ; జెచ్చెర నీశుండు చిక్కుఁ గాక
యితర శాస్త్రంబుల నీశుండు చిక్కునే; మంచివారలకు నిర్మత్సరులకుఁ
గపటనిర్ముక్తులై కాంక్షసేయక యిందుఁ; దగిలియుండుట మహాతత్త్వబుద్ధిఁ
(తేటగీతి)
బరఁగ నాధ్యాత్మికాది తాపత్రయంబు
నణఁచి పరమార్థభూతమై యఖిల సుఖద
మై సమస్తంబుఁగాకయు నయ్యునుండు
వస్తువెఱుఁగంగఁ దగుభాగవతమునందు.
వేదకల్పవృక్షవిగళితమై శుక
ముఖసుధాద్రవమున మొనసి యున్న
భాగవతపురాణఫలరసాస్వాదన
పదవిఁ గనుఁడు రసికభావవిదులు.
ధీరులు నిరపేక్షులు నా
త్మారాములు నైన మునులు హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు
నారాయణుఁ డట్టి వాఁడు నవ్యచరిత్రా!
నిగమములు వేయుఁ జదివిన
సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్
సుగమంబు భాగవత మను
నిగమంబుఁ బఠింప ముక్తి నివసనము బుధా!
ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కిం
చిద్ద్రోహంబును నీకుఁ జేయరు బలోత్సేకంబుతోఁ జీఁకటిన్
భద్రాకారులఁ బిన్నపాఁపల రణప్రౌఢక్రియా హీనులన్
నిద్రాసక్తుల సంహరింప నకటా! నీ చేతు లెట్లాడెనో?
చెల్లెలి కోడల నీ మే
నల్లుఁడు శత్రువులచేత హతుఁడయ్యెను సం
ఫుల్లారవిందలోచన!
భల్లాగ్ని నణంచి శిశువు బ్రతికింపఁగదే.
తన సేవారతిచింత గాని పరచింతాలేశమున్ లేని స
జ్జనులం బాండుతనూజులన్ మనుపు వాత్సల్యంబుతో ద్రోణనం
దను బ్రహ్మాస్త్రము నడ్డుపెట్టఁ బనిచెన్ దైత్యారి సర్వారి సా
ధన నిర్వక్రము రక్షితాఖిల సుధాంధశ్చక్రముం జక్రమున్.
సకలప్రాణిహృదంతరాళముల భాస్వజ్జ్యోతియై యుండు సూ
క్ష్మకళుం డచ్యుతుఁ డయ్యెడన్ విరటజా గర్భంబుఁ దాఁ జక్రహ
స్తకుఁడై వైష్ణవమాయఁ గప్పి కురు సంతానార్థియై యడ్డమై
ప్రకటస్ఫూర్తి నణంచె ద్రోణతనయబ్రహ్మాస్త్రమున్ లీలతోన్.
కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో
గోపికఁ ద్రాటఁ గట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధా
రాపరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చనూర్చుచుం
బాపఁడవై నటించుట కృపాపర! నామదిఁ జోద్య మయ్యెడిన్.
యాదవు లందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి
చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా!
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా!
లోకద్రోహి నరేంద్రవంశ దహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణ గోగణార్తి హరణా! నిర్వాణ సంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!
రాజఁట ధర్మజుండు, సురరాజ సుతుండట ధన్వి, శాత్రవో
ద్వేజకమైన గాండివము విల్లఁట, సారథి సర్వభద్ర సం
యోజకుఁడైన చక్రి యఁట, యుగ్ర గదాధరుఁడైన భీముఁ డ
య్యాజికిఁ దోడు వచ్చునఁట, యాపద గల్గుట యేమి చోద్యమో!
ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముం జేసి దృ
గ్జాలంబున్ హరిమోముపైఁ బఱపి తత్కారుణ్యదృష్టిన్ విని
ర్మూలీభూత శరవ్యధా నిచయుఁడై మోదించి భీష్ముండు సం
శీలం బొప్ప నుతించెఁ గల్మష గజశ్రేణీ హరిన్ శ్రీహరిన్.
త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.
హయ రింఖాముఖ ధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ
చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.
నరుమాటల్విని నవ్వుతో నుభయసేనా మధ్యమక్షోణిలో
బరు లీక్షింప రథంబు నిల్పి పర భూపాలావళిం జూపుచుం
బర భూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ
పరమేశుండు వెలుంగుచుండెడు మనః పద్మాసనాసీనుఁడై.
తనవారిఁ జంపఁ జాలక
వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్
ఘన యోగవిద్యఁ బాపిన
మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్.
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి; గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ;
నుఱికిన నోర్వక యుదరంబులో నున్న; జగముల వ్రేఁగున జగతి గదలఁ;
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ; బైనున్న పచ్చని పటము జాఱ;
నమ్మితి నాలావు నగుఁబాటు సేయక; మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ;
(తేటగీతి)
గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి
"నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున" యనుచు మద్విశిఖవృష్టిఁ
దెరలి చనుదెంచుదేవుండు దిక్కునాకు.
తనకున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహాధర్మంబు వొమ్మంచు న
ర్జునసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్
మునికోలన్వడిఁ జూపి ఘోటకములన్మోదించి తాడించుచున్
జనులన్మోహము నొందఁజేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్.
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానావి ధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్ఠింతు శుద్ధుండనై.
నీపాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా! నీ సేవ సంసార సం
తాపధ్వంసిని యౌఁ గదా! సకలభద్రశ్రేణులం బ్రీతితో
నాపాదింతు గదా! ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబు ని
ర్వ్యాపారంబు గదయ్య! చాలరు గదా! వర్ణింప బ్రహ్మాదులున్.
జలజాతాక్షుఁడు సూడ నొప్పె ధవళఛ్ఛత్రంబుతోఁ జామరం
బులతోఁ బుష్ప పిశంగ చేలములతో భూషామణిస్ఫీతుఁ డై
నలినీభాంధవుతో శశిధ్వయముతో నక్షత్రసంఘంబుతో
బలభిచ్ఛాపముతోఁ దటిల్లతికతో భాసిల్లు మేఘాకృతిన్.
అన్నా! ఫల్గున! భక్తవత్సలుఁడు, బ్రహ్మణ్యుండు, గోవిందుఁ డా
పన్నానీక శరణ్యుఁ డీశుఁడు, జగద్భద్రానుసంధాయి, శ్రీ
మన్నవ్యాంబుజ పత్రనేత్రుఁడు, సుధర్మామధ్య పీఠంబునం
దున్నాఁడా? బలభద్రుఁ గూడి సుఖియై యుత్సాహియై, ద్వారకన్.
మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితోఁ బోరుచో
సన్నాహంబునఁ గాలకేయుల వడిం జక్కాడుచోఁ బ్రాభవ
స్కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులం ద్రోలుచోఁ
గన్నీరెన్నడుఁ దేవు తండ్రి! చెపుమా! కల్యాణమే? చక్రికిన్.
మన సారథి, మన సచివుడు,
మన వియ్యము, మన సఖుండు, మన భాంధవుఁడున్,
మన విభుడు, గురుడు, దేవర,
మనలను దిగనాడి చనియె మనుజాధీశా!
ఇభజిద్వీర్య! మఖాభిషిక్తమగు నీ యిల్లాలి ధమ్మిల్లమున్
సభలో శాత్రవు లీడ్చినన్ ముడువకా చంద్రాస్య దుఃఖింపఁగా
నభయం బిచ్చి ప్రతిజ్ఞచేసి భవదీయారాతికాంతా శిరో
జ భరశ్రీలు హరింపఁడే? విధవలై సౌభాగ్యముల్ వీడఁగన్.
గురుభీష్మాదులు గూడి పన్నిన కురుక్షోణీశచక్రంబులో
గురుశక్తిన్ రథయంత యై నొగలపైఁ గూర్చుండి యా మేటి నా
శరముల్ వాఱక మున్న వారల బలోత్సాహాయు రుద్యోగ త
త్పరతల్ చూడ్కుల సంహరించె నమితోత్సాహంబు నా కిచ్చుచున్.
అటమటమయ్యె నా భజన మంతయు భూవర! నేఁడు చూడుమా
యిటువలె గారవించు జగదీశుఁడు గృష్ణుఁడు లేని పిమ్మటన్
బటుతర దేహలోభమునఁ బ్రాణము లున్నవి వెంటఁ బోక నేఁ
గటకట! పూర్వజన్మమునఁ గర్మము లెట్టివి చేసినాఁడనో?
ఉరుగాధీశ విషానలంబునకు మే నొప్పింతు శంకింప నీ
శ్వర సంకల్పము నేఁడు మానదు; భవిష్యజ్జన్మజన్మంబులన్
హరి చింతా రతియున్ హరిప్రణుతి భాషాకర్ణనాసక్తియున్
హరి పాదాంబుజ సేవయున్ గలుగ మీ రర్థిన్ బ్రసాదింపరే?