శ్రీకంఠచాప ఖండన!
పాకారి ప్రముఖ వినుత భండన! విలసత్
కాకుత్స్థవంశమండన!
రాకేందు యశోవిశాల! రామనృపాలా!
ఏమినోము ఫలమొ యింత ప్రొ ద్దొక వార్త
వింటి మబలలార! వీను లలర
మన యశోద చిన్ని మగవానిఁ గనె నట
చూచి వత్త మమ్మ! సుదతులార!
బాలుం డెక్కడ? బండి యెక్కడ? నభోభాగంబుపైఁ జేడ్పడన్
గాలం దన్నుట యెక్క? డాటపడుచుల్ గల్లాడి? రీ జడ్డు ప
ల్కే లోకంబున నైనఁ జెప్పఁబడునే? యే చందమో కాక యం
చాలాపించుచుఁ వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యలై రంతటన్.
అలసితివి గదన్న! యాకొంటివి గదన్న!
మంచి యన్న! యేడ్పు మాను మన్న!
చన్నుఁ గుడువు మన్న! సంతసపడు మన్న!
యనుచుఁ జన్నుఁ గుడిపె నర్భకునకు.
తనువున నంటిన ధరణీపరాగంబు; పూసిన నెఱి భూతిపూఁత గాఁగ;
ముందఱ వెలుగొందు ముక్తాలలామంబు; తొగలసంగడికాని తునుక గాఁగ;
ఫాలభాగంబుపైఁ బరఁగు గావలిబొట్టు; కాముని గెల్చిన కన్ను గాఁగఁ;
కంఠమాలికలోని ఘన నీలరత్నంబు; కమనీయ మగు మెడకప్పు గాఁగ;
హారవల్లు లురగ హారవల్లులు గాఁగ;
బాలులీలఁ బ్రౌఢబాలకుండు
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును
వేఱులేమిఁ దెలుప వెలయునట్లు.
బాలురకుఁ బాలు లే వని
బాలింతలు మొఱలు వెట్టఁ బకపక నగి యీ
బాలుం డాలము సేయుచు
నాలకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!
పడఁతీ! నీ బిడ్డడు మా
కడవలలో నున్న మంచి కాఁగిన పా లా
పడుచులకుఁ బోసి చిక్కిన
కడవలఁ బో నడిచె నాజ్ఞ కలదో లేదో?
మీ పాపఁడు మా గృహమున
నా పోవఁగఁ బాలు ద్రావ నగపడ కున్నన్
గోపించి పిన్నపడుచుల
వాపోవఁగఁ జిమ్ముకొనుచు వచ్చెం దల్లీ!
ఆడం జని మీగడ పెరు
గోడక నీ సుతుఁడు త్రావి యొక యించుక తాఁ
గోడలి మూఁతిం జరిమినఁ
గోడలు మ్రు చ్చనుచు నత్త కొట్టె లతాంగీ!
వా రిల్లు సొచ్చి కడవలఁ
దోరంబుగ నెయ్యి త్రావి తుది నా కడవల్
వీ రింటను నీ సుతుఁ డిడ
వారికి వీరికిని దొడ్డ వా దయ్యె సతీ!
కలకంఠి! మా వాడ గరితల మెల్ల నీ; పట్టి రాఁగల డని పాలు పెరుగు
లిండ్లలోపల నిడి యే మెల్లఁ దన త్రోవఁ; చూచుచో నెప్పుడు చొచ్చినాఁడొ?
తలుపులు ముద్రలు తాళంబులును పెట్టి; యున్న చందంబున నున్న వరయ;
నొక యింటిలోఁ బాడు నొక యింటిలోఁ నాడు; నొక యింటిలో నవ్వు నొకటఁ దిట్టు;
నొకట వెక్కిరించు నొక్కొకచో మృగ
పక్షి ఘోషణములు పరఁగఁ జేయు
నిట్లు చేసి వెనుక నెక్కడఁ బోవునో
కాన రాఁడు రిత్త కడవ లుండు.
ఓ యమ్మ! నీ కుమారుఁడు
మా యిండ్లను బాలు పెరుగు మననీఁ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా యన్నల సురభు లాన మంజులవాణీ!
అమ్మా! మన్ను దినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో?
నమ్మం జూడకు వీరి మాటలు మది;న్నన్నీవు కొట్టంగ వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీ యాస్య గం
ధమ్మాఘ్రాణము సేసి నా వచనముల్ దప్పైన దండింపవే.
కలయో! వైష్ణవ మాయయో! యితర సంకల్పార్థమో! సత్యమో!
తలఁపన్నేరక యున్నదాననొ! యశోదాదేవిఁ గానో! పర
స్థలమో! బాలకుఁ డెంత? యీతని ముఖస్థం బై యజాండంబు ప్ర
జ్వల మై యుండుట కేమి హేతువొ! మహాశ్చర్యంబు చింతింపఁగన్.
బాలుఁ డీతం డని భావింతు నందునా; యే పెద్దలును నేర రీ క్రమంబు
వెఱ పెఱుంగుటకు నై వెఱపింతు నందునా; కలిగి లే కొక్కఁడు గాని లేఁడు
వెఱపుతో నాబుద్ధి వినిపింతు నందునా; తనుదాన యై బుద్ధిఁ దప్ప కుండు
నొం డెఱుంగక యింట నుండెడి నందునా; చొచ్చి చూడని దొకచోటు లేదు
తన్ను నెవ్వ రైనఁ దలపోయఁ బాఱెడు
నోజ లేదు భీతి యొక టెఱుంగఁ
డెలమి నూరకుండఁ డెక్కసక్కెముల నాడుఁ
బట్టి శాస్తి జేయు భంగి యెట్లు?
నీ పద్యావళు లాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్
నీ పేరం బనిసేయు హస్తయుగమున్ నీ మూర్తిపైఁ జూపులున్
నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపైఁ జిత్తముల్
నీ పై బుద్దుల మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణా!
రా పూర్ణచంద్రిక! రా గౌతమీగంగ!; రమ్ము భగీరథరాజతనయ!
రా సుధాజలరాశి! రా మేఘమాలిక!; రమ్ము చింతామణి! రమ్ము సురభి!
రా మనోహారిణి! రా సర్వమంగళ!; రా భారతీదేవి! రా ధరిత్రి!
రా శ్రీమహాలక్ష్మి! రా మందమారుతి!; రమ్ము మందాకిని! రా శుభాంగి!
యనుచు మఱియుఁ గలుగు నాఖ్యలు గల గోవు
లడవిలోన దూర మందు మేయ
ఘన గభీర భాషఁ గడు నొప్పఁ జీరు నా
భీరజనులు బొగడఁ బెంపు నెగడ.
నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూతదయయును
దాపసమందార! నాకు దయచేయఁ గదే.
ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్
జగతీనాథులఁ జైద్యపక్ష చరులన్ సాళ్వాదులం గెల్చి భ
ద్రగుఁ డై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా
భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్.
ఏ నీ గుణములు గర్ణేంద్రియంబులు సోఁక; దేహతాపంబులు దీఱిపోవు
నే నీ శుభాకార మీక్షింపఁ గన్నుల; కఖిలార్థలాభంబు గలుగుచుండు
నే నీ చరణసేవ లే ప్రొద్దు చేసిన; భువనోన్నతత్వంబుఁ బొందఁ గలుగు
నే నీ లసన్నామ మే ప్రొద్దు భక్తితోఁ; దడవిన బంధసంతతులు వాయు
నట్టి నీ యందు నా చిత్త మనవరతము
నచ్చి యున్నది నీ యాన నాన లేదు,
కరుణఁ జూడుము కంసారి! ఖలవిదారి!
శ్రీయుతాకార! మానినీచిత్తచోర!
శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున మత్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ
డా యధమాధముం డెఱుఁగఁ డద్భుతమైన భవత్ప్రతాపముల్.
అంకిలి సెప్పలేదు; చతురంగ బలంబులతోడ నెల్లి యో!
పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి నా
వంకకు వచ్చి రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే
యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము వచ్చెదన్.
ప్రాణేశ! నీ మంజు భాషలు వినలేని; కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపఁగా లేని; తనులతవలని సౌందర్య మేల?
భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని; చక్షురింద్రియముల సత్వ మేల?
దయిత! నీ యధరామృతం బానఁగా లేని; జిహ్వకు ఫలరససిద్ధి యేల?
నీరజాతనయన! నీ వనమాలికా
గంధ మబ్బలేని ఘ్రాణ మేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని
జన్మ మేల? యెన్ని జన్మములకు.
వచ్చెద విదర్భభూమికిఁ;
జొచ్చెద భీష్మకుని పురము; సురుచిరలీలన్
దెచ్చెద బాలన్ వ్రేల్మిడి
వ్రచ్చెద నడ్డంబు రిపులు వచ్చినఁ బోరన్.
ఘనుఁ డా భూసురు డేఁగెనో? నడుమ మార్గశ్రాంతుఁ డై చిక్కెనో?
విని కృష్ణుం డది తప్పుగాఁ దలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం
డనుకూలింపఁ దలంచునో తలపఁడో? యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?
చెప్పదు తల్లికిం దలఁపు చిక్కు; దిశల్ దరహాస చంద్రికన్
గప్పదు; వక్త్రతామరస గంధ సమాగత భృంగసంఘమున్
రొప్పదు; నిద్రఁ గైకొన; దురోజ పరస్పరసక్త హారముల్
విప్పదు; కృష్ణమార్గగత వీక్షణపంక్తులఁ ద్రిప్ప దెప్పుడున్.
తగు నీ చక్రి విదర్భరాజ సుతకున్; దథ్యంబు వైదర్భియుం
దగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱిం
దగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా; దర్పాహతారాతి యై
మగఁ డౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్య మూలంబునన్.
నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ సేయు మమ్మ! నిన్
నమ్మిన వారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!
కనియెన్ రుక్మిణి చంద్రమండల ముఖుం, గంఠీరవేం ద్రావల
గ్ను, నవాంభోజదళాక్షుఁ, జారుతర వక్షున్, మేఘసంకాశ దే
హు, నగారాతి గజేంద్రహస్త నిభ బాహుం, జక్రిఁ, బీతాంబరున్,
ఘన భూషాన్వితుఁ, గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్.
ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై
భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం
ధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్.
లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల గణఁగి లేచితి? విటు రా
లే మాను; మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్.
సౌవర్ణ కంకణ ఝణఝణ నినదంబు; శింజినీరవముతోఁ జెలిమి సేయఁ
దాటంక మణిగణ ధగధగ దీప్తులు; గండమండల రుచుల్ గప్పికొనఁగ
ధవళతరాపాంగ ధళధళ రోచులు; బాణజాలప్రభాపటలి నణఁప
శరపాత ఘుమఘుమ శబ్దంబు పరిపంథి; సైనిక కలకల స్వనము లుడుప
వీర శృంగార భయ రౌద్ర విస్మయములు
గలసి భామిని యయ్యెనో కాక యనఁగ
నిషువుఁ దొడుగుట విడుచుట యేయు టెల్ల
నెఱుఁగరాకుండ నని సేసె నిందువదన.
పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్, రోషరాగోదయా
విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్
జరగన్; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగన్ జండాస్త్ర సందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచున్, జంద్రాస్య హేలాగతిన్.
రాకేందుబింబ మై రవిబింబ మై యొప్పు; నీరజాతేక్షణ నెమ్మొగంబు;
కందర్పకేతు వై ఘన ధూమకేతు వై; యలరుఁ బూఁబోఁణి చేలాంచలంబు;
భావజు పరిధి యై ప్రళయార్కు పరిధి యై; మెఱయు నాకృష్ట మై మెలఁత చాప;
మమృత ప్రవాహ మై యనల సందోహ మై; తనరారు నింతి సందర్శనంబు;
హర్ష దాయి యై మహారోష దాయి యై
పరఁగు ముద్దరాలి బాణవృష్టి;
హరికి నరికిఁ జూడ నందంద శృంగార
వీరరసము లోలి విస్తరిల్ల.
కొమ్మా! దానవ నాథుని
కొమ్మాహవమునకుఁ దొలఁగె; గురువిజయముఁ గై
కొమ్మా! మెచ్చితి నిచ్చెదఁ
గొమ్మాభరణములు నీవు గోరిన వెల్లన్.
వనజాక్షి! నేఁ గన్క వైజయంతిక నైన; గదిసి వ్రేలుదు గదా కంఠమందు;
బింబోష్ఠి! నేఁ గన్క బీతాంబరము నైన; మెఱసి యుండుదు గదా మేనునిండఁ;
గన్నియ! నేఁ గన్క గౌస్తుభమణి నైన; నొప్పు చూపుదుఁ గదా యురమునందు;
బాలిక! నేఁ గన్కఁ బాంచజన్యము నైన; మొనసి చొక్కుదుఁ గదా మోవిఁ గ్రోలి;
పద్మగంధి! నేను బర్హ దామమ నైనఁ
చిత్రరుచుల నుందు శిరమునందు
ననుచుఁ బెక్కుగతుల నాడిరి కన్యలు
గములు గట్టి గరుడగమనుఁ జూచి.