ఘనుని శ్రీకృష్ణునిఁ గౌస్తుభాభరణునిఁ; గర్ణకుండల యుగ్మ ఘన కపోలుఁ
బుండరీకాక్షు నంభోధరశ్యామునిఁ; గలిత నానారత్న ఘన కిరీటు
నాజానుబాహు నిరర్గళాయుధహస్తు; శ్రీవక్షుఁ బీత కౌశేయవాసు
రుక్మిణీ నయనసరోజ దివాకరు; బ్రహ్మాది సుర సేవ్య పాదపద్ము
దుష్ట నిగ్రహ శిష్ట సంతోషకరణుఁ
గోటిమన్మథ లావణ్య కోమలాంగు
నార్తజన రక్షణైక విఖ్యాతచరితుఁ
గనిరి కరుణాసముద్రుని ఘనులు మునులు.
జనములు నిను సేవింపని
దినములు వ్యర్థంబు లగుచుఁ దిరుగుచునుండున్
దనువులు నిలుకడ గా వఁట
వనములలో నున్ననైన వనరుహనాభా!
తరణంబులు భవజలధికి
హరణంబులు దురితలతల కాగమముల కా
భరణంబు లార్తజనులకు
శరణంబులు, నీ పదాబ్జ సంస్మరణంబుల్.
ఒక్క వేళను సూక్ష్మరూపము నొందు దీ వణుమాత్ర మై
యొక్క వేళను స్థూలరూపము నొందు దంతయు నీవ యై
పెక్కు రూపులుఁ దాల్తు నీ దగు పెంపు మాకు నుతింపఁగా
నక్కజం బగుచున్న దేమన? నంబుజాక్ష! రమాపతీ!
శ్రీనాయక! నీ నామము
నానా భవరోగ దుఃఖ నాశమునకు వి
న్నాణం బగు నౌషధ మిది
గానరు దుష్టాత్ము లకట! కంజదళాక్షా!
అతి పాపకర్ము లైనను
సతతము నారాయణాఖ్య శబ్దము మదిలో
వితతంబుగఁ బఠియించిన
చతురులఁ గొనియాడఁ గమలసంభవు వశమే?
కరణత్రయంబు చేతను
నరుఁ డే కర్మంబు సేయు నయ్యైవేళన్
హరి కర్పణ మని పలుకుట
పరువడి సుజ్ఞానమండ్రు పరమ మునీంద్రుల్.
సంతతంబును గృష్ణ సంకీర్తనంబులు; వీనుల కింపుగ వినఁగవలయు
హరినామ కథనంబు హర్షంబుతోడుతఁ; బాటలఁ నాటలఁ బరఁగవలయు
నారాయణుని దివ్యనామాక్షరంబులు; హృద్వీథి సతతంబు నెన్నవలయుఁ
గంజాక్షు లీలలు గాంతారముల నైన; భక్తి యుక్తంబుగాఁ బాడవలయు
వెఱ్ఱిమాడ్కిని లీలతో విశ్వమయుని
నొడువుచును లోకబాహ్యత నొందవలయు
నింతయును విష్ణుమయ మని యెఱుఁగవలయు
భేద మొనరింప వలవదు మేదినీశ!
సర్వభూతమయుం డైన సరసిజాక్షుఁ
డతఁడె తన యాత్మయం దుండు ననెడువాఁడు
శంఖ చక్ర ధరుం డంచుఁ జనెడువాఁడు
భక్తిభావాభిరతుఁడు వో భాగవతుఁడు.
వర్ణాశ్రమ ధర్మంబుల
నిర్ణయ కర్మములఁ జెడక నిఖిల జగత్సం
పూర్ణుఁడు హరి యను నాతఁడె
వర్ణింపఁగ భాగవతుఁడు వసుధాధీశా!
పరమబ్రహ్మ మనంగాఁ
బరతత్త్వ మనంగఁ బరమపద మనఁగను నీ
శ్వరుఁ డనఁ గృష్ణుఁ డన జగ
ద్భరితుఁడు నారాయణుండు దా వెలుఁగొందున్.
హరిదాసుల మిత్రత్వము
మురరిపు కథ లెన్నికొనుచు మోదముతోడన్
హరుషాశ్రు పులకితుం డెయి
పురుషుఁడు హరిమాయ గెల్చు భూపవరేణ్యా!
తారల నెన్నఁగ వచ్చును;
భూరేణుల లెక్కవెట్టఁ బోలును ధాత్రిన్;
నారాయణ గుణకథనము
లారయ వర్ణింపలేరు హర బ్రహ్మాదుల్.
నవ వికచ సరసిరుహ నయనయుగ! నిజచరణ; గగనచర నది! నిఖిల నిగమ వినుత!
జలధిసుత కుచకలశ లలిత మృగమద రుచిర;పరిమళిత నిజహృదయ! ధరణిభరణ!
ద్రుహిణముఖ సురనికర విహిత నుతికలితగుణ!; కటిఘటిత రుచిరతర కనకవసన!
భుజగరిపు వరగమన! రజతగిరిపతి వినుత!; సతత వృత జప నియమసరణి చరిత!
పరధన పరదార పరదూషణాదులఁ; బరవస్తు చింతఁ దాఁ బరిహరించి
ముదిమిచే రోగము లుదయింప కట మున్న; తనువు చంచలతను దగులకుండ
బుద్ధి సంచలతచేఁ బొదలక యట మున్న; శ్లేష్మంబు గళమునఁ జేరకుండ
శక్తియుక్తుల మది సన్నగిల్లక మున్న; భక్తి భావనచేతఁ బ్రౌఢుఁ డగుచు
దేహము నిత్యము గా దని
మోహముఁ దెగఁ గోసి శుద్ధ మునివర్తనుఁ డై
గేహము వెలువడి నరుఁ డు
త్సాహమునుం జెందు ముక్తిసంపద ననఘా!
నిన్నుఁజూడని కన్నులు నిష్ఫలములు
నిన్ను నొడువని జిహ్వ దా నీరసంబు
నిన్నుఁ గానని దినములు నింద్యము లగుఁ
గన్నులను జూచి మమ్మును గారవింపు.