శ్రీమహిత వినుత దివిజ
స్తోమ! యశస్సీమ! రాజసోమ! సుమేరు
స్థేమ! వినిర్జితభార్గవ
రామ! దశాననవిరామ! రఘుకులరామా!
ఏ పరమేశుచే జగము లీ సచరాచరకోటితో సము
ద్దీపిత మయ్యె; నే విభుని దివ్యకళాంశజు లబ్జగర్భ గౌ
రీపతి ముఖ్య దేవముని బృందము; లెవ్వఁ డనంతుఁ డచ్యుతుం
డా పురుషోత్తముండు గరుణాంబుధి గృష్ణుఁడు వో నరేశ్వరా!
అట్టి సరోజాక్షుఁ డాత్మీయ పదభక్తు; లడవులనిడుమలఁ గుడుచుచుండ
దౌత్యంబు సేయఁ గొందఱు విరోధులు పట్టి; బద్ధునిఁ జేయ సన్నద్ధు లైన
బలహీను మాడ్కి మార్పడ లేఁడ యసమర్థుఁ; డని తలంచెద వేని నచ్యుతుండు
పరుల జయింప నోపక కాదు విద్యాభి;జన ధన మత్తులై జగతిఁ బెక్కు
బాధల గలంచు దుష్ట భూపతుల నెల్ల
సైన్య యుక్తంబుగా నని సంహరించు
కొఱకు సభలోన నప్పు డా కురుకుమారు
లాడు దుర్భాషణములకు నలుగఁ డయ్యె.
జననం బందుట లేని యీశ్వరుఁడుదా జన్మించు టెల్లన్ విరో
ధి నిరాసార్థము వీతకర్ముఁ డగు నద్దేవుండు గర్మప్రవ
ర్తనుఁ డౌ టెల్లఁ జరాచరప్రకట భూతశ్రేణులన్ గర్మ వ
ర్తనులం జేయఁ దలంచి కాక కలవే దైత్యారికిం గర్మముల్.
హరి నరుల కెల్లఁ బూజ్యుఁడు
హరి లీలామనుజుఁడును గుణాతీతుఁడు నై
పరఁగిన భవ కర్మంబులఁ
బొఁరయం డఁట హరికిఁ గర్మములు లీల లగున్.
కనియెం దాపస పుంగవుం డఖిల లోకఖ్యాత వర్ధిష్ణు శో
భన భాస్వత్పరిపూర్ణ యౌవన కళా భ్రాజిష్ణు యోగీంద్ర హృ
ద్వన జాతైక చరిష్ణు కౌస్తుభ ముఖోద్యద్భూషణాలంకరి
ష్ణు నిలింపాహిత జిష్ణు విష్ణుఁ బ్రభవిష్ణుం గృష్ణు రోచిష్ణునిన్.
చారు పటీర హీర ఘనసార తుషార మరాళ చంద్రికా
పూర మృణాళహార పరిపూర్ణ సుధాకర కాశ మల్లికా
సార నిభాంగ శోభిత భుజంగమ తల్పము నందు యోగ ని
ద్రారతిఁ జెంది యుండు జఠరస్థిత భూర్భువరాది లోకుఁ డై.
వర వైకుంఠము సారసాకరము; దివ్యస్వర్ణ శాలాంక గో
పుర హర్మ్యావృత మైన తద్భవన మంభోజంబు; తన్మంది రాం
తర విభ్రాజిత భోగి గర్ణిక; దదుద్యద్భోగ పర్యంకమం
దిరవొందన్ వసియించు మాధవుఁడు దా నేపారు భృంగాకృతిన్.
నిఖిల మునీంద్ర వర్ణిత సస్మితప్రస; న్నాననాంబుజముచే నలరు వాఁడు
విశ్రుత స్నేహార్ద్ర వీక్షణ నిజభక్త;జన గుహాశయుఁ డనఁ దనరు వాఁడు
మానిత శ్యామాయమాన వక్షమున నం;చిత వైజయంతి రాజిల్లు వాఁడు
నత జనావన కృపామృత తరంగితము లై; భాసిల్లు లోచనాబ్జముల వాఁడు
నఖిల యోగీంద్ర జన సేవ్యుఁ డైనవాఁడు
సాధు జనముల రక్షింపఁజాలువాడు
భువనచూడా విభూషణభూరిమహిమ
మించి వైకుంఠపురము భూషించువాఁడు.
కటి విరాజిత పీత కౌశేయ శాటితో; వితత కాంచీగుణ ద్యుతి నటింప
నాలంబి కంఠ హారావళి ప్రభలతోఁ; గౌస్తుభ రోచులు గ్రందు కొనఁగ
నిజ కాంతి జిత తటిద్వ్రజ కర్ణకుండల; రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ
మహనీయ నవ రత్నమయ కిరీటప్రభా; నిచయంబు దిక్కుల నిండఁ బర్వ
వైనతేయాంస విన్యస్త వామహస్త
కలిత కేయూర వలయకంకణము లొప్ప
నన్య కరతల భ్రమణీ కృతానుమోద
సుందరాకార లీలారవింద మమర.
భూరి మదీయ మోహతమముం బెడఁబాప సమర్థు లన్యు లె
వ్వారలు? నీవ కాక నిరవద్య! నిరంజన! నిర్వికార! సం
సారలతా లవిత్ర! బుధసత్తమ! సర్వశరణ్య! ధర్మవి
స్తారక! సర్వలోక శుభదాయక! నిత్యవిభూతి నాయకా!
హరి మంగళ గుణకీర్తన
పరుఁడై తగ నార్జవమున భగవత్పరులన్
గర మనురక్తి భజించుట
నిరహంకారమున నుంట నిశ్చలుఁ డగుటన్
అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి యనం దనర్చు నీ
శు నను నవజ్ఞ సేసి మనుజుం డొగి మత్ప్రతిమార్చనా విడం
బనమున మూఢుఁ డై యుచిత భక్తిని నన్ను భజింపఁడేని య
మ్మనుజుఁడు భస్మకుండమున మానక వేల్చిన యట్టివాఁ డగున్.
ఎవ్వఁడు నిఖిలభూతేంద్రియమయ మగు; మాయావలంబున మహిత కర్మ
బద్ధుఁ డై వర్తించుపగిది దందహ్యమా;నం బగు జీవచిత్తంబునందు
నవికార మై శుద్ధ మై యఖండజ్ఞాన;మున నుండు వానికి ముఖ్యచరితు
నకు నకుంఠితశౌర్యునకుఁ పరంజ్యోతికి; సర్వఙ్ఞునకుఁ గృపాశాంతమతికిఁ
గడఁగియుఁ బ్రకృతిపురుషులకంటెఁ బరముఁ
డైన వానికి మ్రొక్కెద నస్మదీయ
దుర్భరోదగ్రభీకర గర్భనరక
వేదనలు మాన్చి శాంతిఁ గావించుకొఱకు.
భర మగుచున్న దుర్వ్యసన భాజన మై ఘన దుఃఖమూల మై
యరయఁగ బెక్కుతూంట్లు గల దై క్రిమిసంభవ మైన యట్టి దు
స్తర బహుగర్భవాసముల సంగతి మాన్పుటకై భజించెదన్
సరసిజనాభ భూరి భవసాగరతారక పాదపద్మముల్.
ధన పశు పుత్ర మిత్ర వనితా గృహ కారణభూత మైన యీ
తనువున నున్న జీవుఁడు పదంపడి యట్టి శరీర మెత్తిన
న్ననుగత మైన కర్మఫల మందక పోవఁగరాదు మిన్ను బ్రా
కిన భువిఁ దూఱినన్ దిశల కేగిన నెచ్చటనైన డాగిఁనన్.
నీ నామస్తుతి శ్వపచుం
డైనను జిహ్వాగ్రమందు ననుసంధింపన్
వానికి సరి భూసురుఁడున్
గానేరఁడు చిత్ర మిది జగంబుల నరయన్.