నీరాట వనాటములకుఁ
బోరాటం బెట్లు గలిగెఁ? బురుషోత్తముచే
నారాట మెట్లు మానెను
ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్.
అటఁ గాంచెన్ గరిణీవిభుండు నవ ఫుల్లాంభోజ కల్హారమున్
నట దిందిందిర వారమున్ గమఠమీనగ్రాహ దుర్వారమున్
వట హింతాల రసాల సాల సుమనో వల్లీ కుటీ తీరమున్
జటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబుఁ గాసారమున్.
తొండంబులఁ బూరింపుచు
గండంబులఁ జల్లుకొనుచు గళగళ రవముల్
మెండుకొన వలుఁదకడుపులు
నిండన్ వేదండకోటి నీరుం ద్రావెన్.
ఇభలోకేంద్రుఁడు హస్తరంధ్రముల నీ రెక్కించి పూరించి చం
డభ మార్గంబున కెత్తి నిక్కి వడి నుడ్డాడించి పింజింప నా
రభటిన్నీరములోనఁ బెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్
నభమం దాడెడు మీన కర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాన్పడన్.
కరిణీ కరోజ్ఝిత కంకణ చ్ఛటఁ దోఁగి; సెలయేటి నీలాద్రి చెలువుఁ దెగడు
హస్తినీ హస్తవిన్యస్త పద్మంబుల; వేయిగన్నులవాని వెఱవు సూపుఁ
కలభ సముత్కీర్ణ కల్హార రజమునఁ; గనకాచలేంద్రంబు ఘనతఁ దాల్చు
గుంజరీ పరిచిత కుముద కాండంబుల; ఫణిరాజమండన ప్రభ వహించు
మదకరేణు ముక్త మౌక్తిక శుక్తుల
మెఱుఁగు మొగిలుతోడ మేలమాడు
నెదురులేని గరిమ నిభరాజ మల్లంబు
వనజగేహకేళి వ్రాలు నపుడు.
భుగభుగాయుత భూరి బుద్భుద చ్ఛటలతోఁ; గదలుచు దివికి భంగంబు లెగయ;
భువన భయంకర ఫూత్కార రవమున; ఘోర నక్రగ్రాహకోటి బెగడ;
వాలవిక్షేప దుర్వార ఝంఝానిల; వశమున ఘమఘ మావర్త మడరఁ;
గల్లోల జాల సంఘట్టనంబులఁ దటీ; తరులు మూలములతో ధరణిఁ గూల;
సరసిలోనుండి పొడగని సంభ్రమించి
యుదరి కుప్పించి లంఘించి హుంకరించి
భానుఁ గబళించి పట్టు స్వర్భానుపగిది
నొక్క మకరేంద్రుఁ డిభరాజు నొడిసి పట్టె.
కరిఁ దిగుచు మకరి సరసికిఁ
గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్
కరికి మకరి మకరికిఁ గరి
భర మన నిట్లతల కుతల భటు లదిరి పడన్.
ఆటోపమ్మునఁ జిమ్ము ఱొమ్మగల వజ్రాభీల దంతంబులన్
దాఁటించున్ మెడఁ జుట్టి పట్టి హరి దోర్దండాభ శుండాహతిన్
నీటన్ మాటికి మాటికిం దిగువఁగా నీరాటమున్నీటి పో
రాటం దోటమిపాటుఁ జూపుట కరణ్యాటంబు వాచాట మై.
మకరితోడఁ బోరు మాతంగవిభుని నొ
క్కరుని డించిపోవఁ గాళ్ళు రాక
కోరి చూచుచుండెఁ గుంజరీయూథంబు
మగలు దగులుగారె మగువలకును.
పాదద్వంద్వము నేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియో
న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్ మాఱాకు హత్తించి ని
ష్ఖేదబ్రహ్మపదావలంబన గతిం గ్రీడించు యోగీంద్రు మ
ర్యాదన్ నక్రము విక్రమించెఁ గరి పాదాక్రాంత నిర్వక్ర మై.
ఏ రూపంబున దీని గెల్తు? నిటమీఁ దే వేల్పుఁ జింతింతు? నె
వ్వారిం జీరుదు? నెవ్వ రడ్డ? మిఁక నివ్వారిప్రచారోత్తమున్
వారింపం దగువార లెవ్వ? రఖిలవ్యాపారపారాయణుల్
లేరే? మ్రొక్కెద దిక్కుమాలిన మొ ఱాలింపం బ్రపుణ్యాత్మకుల్.
నానానేకప యూధముల్ వనములోనం బెద్దకాలంబు స
న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండ నై యుండి మ
ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండలే
కీ నీరాశ నిటేల వచ్చితి? భయం బెట్లోకదే యీశ్వరా!
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వనిలోపల నుండు లీన మై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాది మధ్య లయుఁ డెవ్వఁడు; సర్వముఁ దాన యైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
ఒకపరి జగములు వెలినిడి
యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దా నై
సకలార్థ సాక్షి యగు న
య్యకలంకుని నాత్మమూలు నర్థిఁ దలంతున్.
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగిన తుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వడు
నేకాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.
నర్తకుని భంగిఁ బెక్కగు
మూర్తులతో నెవ్వఁ డాడు? మునులుఁ దివిజులున్
గీర్తింప నేర? రెవ్వని
వర్తన మొరు లెఱుఁగ? రట్టి వాని నుతింతున్.
కలఁ డందురు దీనుల యెడఁ
గలఁ డందురు పరమయోగి గణములపాలం
గలఁ డందు రన్ని దిశలను
గలఁడు కలం డనెడి వాఁడు గలఁడో లేఁడో?
కలుగఁడే నాపాలి కలిమి సందేహింపఁ; గలిమిలేములు లేకఁ గలుగువాఁడు?
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁ; బడిన సాధుల కడ్డపడెడు వాఁడు?
చూడఁడే నా పాటుఁ చూపులఁ జూడకఁ; జూచువారలఁ గృపఁ జూచువాఁడు?
లీలతో నా మొ ఱాలింపఁడే మొఱఁగుల; మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?
నఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
నాది మధ్యాంతములు లేక యడరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?
లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలం బయ్యెఁ; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమం బయ్యెడిన్;
నీవే తప్ప నితః పరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!
ఓ! కమలాప్త! యో! వరద! యో! ప్రతిపక్ష విపక్షదూర! కు
య్యో! కవి యోగి వంద్య! సుగుణోత్తమ! యో! శరణాగ తామరా
నోకహ! యో! మునీశ్వర మనోహర! యో! విపులప్రభావ! రా
వే కరుణింపవే తలఁపవే శరణార్థిని నన్నుగావవే.
విశ్వమయత లేమి వినియు నూరక యుండి
రంబుజాసనాదు లడ్డపడక
విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు
భక్తియుతున కడ్డపడఁ దలంచి.
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూలసౌధంబు దా
పల మందార వనాంత రామృతసరఃప్రాం తేందుకాం తోప లో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వలనాగేంద్రము "పాహి పాహి" యనఁ గు య్యాలించి సంరంభి యై.
సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబును జీరఁ డభ్రగపతిం బన్నింపఁ డాకర్ణి కాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోద్ధతశ్రీకుచో
పరి చేలాంచల మైన వీడఁడు గజప్రాణావనోత్సాహి యై.
తనవెంటన్ సిరి; లచ్చివెంట నవరోధవ్రాతమున్; దాని వె
న్కనుఁ బక్షీంద్రుఁడు; వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును; నారదుండు; ధ్వజినీకాంతుండు దా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాల గోపాలమున్.
తన వేంచేయు పదంబుఁ బేర్కొనఁ; డనాథస్త్రీజనాలాపముల్
వినెనో? మ్రుచ్చులు మ్రుచ్చలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్?
దనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో? భక్తులం
గని చక్రాయుధుఁ డేఁడి చూపుఁ డని ధిక్కారించిరో? దుర్జనుల్.
అడిగెద నని కడువడిఁ జను
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడ వెడ సిడిముడి తడఁబడ
నడుగిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్.
నిటలాలకము లంటి నివుర జుం జుమ్మని; ముఖసరోజము నిండ ముసురుఁ దేంట్లు;
నళులఁ జోపఁగఁ జిల్క లల్ల నల్లన జేరి; యోష్ఠబింబద్యుతు లొడియ నుఱుకు;
శుకములఁ దోలఁ జక్షుర్మీనములకు మం;దాకినీ పాఠీనలోక మెగుచు;
మీనపంక్తుల దాఁట మొయిదీఁగతో రాయ; శంపాలతలు మింట సరణిఁ గట్టు;
శంపలను జయింపఁ జక్రవాకంబులుఁ
కుచయుగంబుఁ దాఁకి క్రొవ్వు చూపు;
మెలఁత మొగులు పిఱిఁది మెఱుఁగుఁ దీగెయుఁ బోలె
జలదవర్ణు వెనుకఁ జరుగు నపుడు.
వినువీథిన్ జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీ
వనసంపత్తి నిరాకరిష్ణుఁ గరుణా వర్ధిష్ణుఁ యోగీంద్ర హృ
ద్వన వర్తిష్ణు సహిష్ణు భక్తజన బృందప్రాభ వాలంకరి
ష్ణు నవోఢోల్లస దిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్.
చనుదెంచెన్ ఘనుఁ డల్ల వాఁడె; హరి పజ్జం గంటిరే లక్ష్మి? శం
ఖనినాదం బదె; చక్ర మల్లదె; భుజంగధ్వంసియున్ వాఁడె; క్ర
న్నన నేతెంచె నటంచు వేల్పులు "నమో నారాయణా యేతి" ని
స్వను లై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్.
అవనీనాథ! గజేంద్రుఁ డా మకరితో నాలంబుఁ గావించె మున్
ద్రవిళాధీశుఁ డతండు పుణ్యతముఁ డింద్రద్యుమ్న నాముండు వై
ష్ణవముఖ్యుండు గృహీత మౌననియతిన్ సర్వాత్ము నారాయణున్
సవిశేషంబుగఁ బూజ చేసెను మహాశైలాగ్ర భాగంబునన్.
ఒకనాఁ డా నృపుఁ డచ్యుతున్ మనములో నూహింపుచున్ మౌని యై
యకలంకస్థితి నున్నచోఁ గలశజుం డచ్చోటికిన్ వచ్చి లే
వక పూజింపక యున్న రాజుఁ గని నవ్యక్రోధుఁ డై "మూఢ! లు
బ్ధ! కరీం ద్రోత్తమ యోనిఁ బుట్టు" మని శాపం బిచ్చె భూవల్లభా!
నరనాథ! నీకును నాచేత వివరింపఁ; బడిన యీ కృష్ణానుభావ మైన
గజరాజ మోక్షణ కథ వినువారికి; యశము లిచ్చును గల్మషాపహంబు;
దుస్స్వప్న నాశంబు దుఃఖ సంహారంబుఁ; బ్రొద్దుల మేల్కాంచి పూతవృత్తి
నిత్యంబుఁ బఠియించు నిర్మలాత్ముకు లైన; విప్రులకును బహువిభవ మమరు;
సంపదలు గల్గుఁ; బీడలు శాంతిఁ బొందు;
సుఖము సిద్ధించు; వర్థిల్లు శోభనములు;
మోక్ష మఱచేతి దై యుండు; ముదము చేరు
ననుచు విష్ణుండు ప్రీతుఁ డై యానతిచ్చె.
బలి నంభోరుహ నేత్రుఁ డేమి కొఱకై పాదత్రయిన్ వేఁడె? ని
శ్చలుఁడుం బూర్ణుఁడు లబ్దకాముఁడు రమాసంపన్నుఁ డై తాఁ బర
ష్కలుషున్ బంధన మేల చేసెను? వినం గౌతూహలం బయ్యెడిన్.
నన్నుఁ గన్న తండ్రి! నా పాలి దైవమ!
నా తపః ఫలంబ! నా కుమార!
నాదు చిన్నివడుగ! నా కులదీపిక!
రాఁగదయ్య; భాగ్యరాశి వగుచు
హరిహరి; సిరియురమునఁగల
హరి హరిహయు కొఱకు దనుజు నడుగన్ జనియెన్;
బరహిత రతమతియుతు లగు
దొరలకు నడుగుటలు నొడలి తొడవులు పుడమిన్.
స్వస్తి జగత్త్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర వి
ద్వస్త నిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధానవిహర్తకు, నిర్జరీ గళ
న్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్.
వడుగా! యెవ్వరివాఁడ? వెవ్వఁడవు? సంవాసస్థలం బెయ్య? ది
య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మమున్;
గడు ధన్యాత్ముఁడ నైతి; నీ మఖము యోగ్యం బయ్యె; నా కోరికల్
గడతేఱెన్; సుహుతంబు లయ్యె శిఖులుం; గల్యాణ మిక్కాలమున్.
వరచేలంబులొ మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా!
ఒంటివాఁడ నాకుఁ నొకటి రెం డడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల;
గోర్కిఁదీర బ్రహ్మకూకటి ముట్టెద
దానకుతుకసాంద్ర! దానవేంద్ర!
వసుధాఖండము వేఁడితో? గజములన్ వాంఛించితో? వాజులన్
వెస నూహించితొ? కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో?
పసి బాలుండవు; నేర వీ వడుగ; నీ భాగ్యంబు లీపాటి గా
కసురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీనేర్చునే?
గొడుగో. జన్నిదమో, కమండలువొ. నాకున్ ముంజియో, దండమో,
వడుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్కడ? నిత్యోచితకర్మ మెక్కడ? మదాకాంక్షామితం బైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటయె బ్రహ్మాండంబు నా పాలికిన్.
ఆశాపాశంబు దాఁ గడున్నిడుపు; లే దంతంబు రాజేంద్ర! వా
రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసిం బొందిరిఁ గాక వైన్య గయ భూకాంతాదులున్నర్థకా
మాశం బాయఁగనేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే.
దనుజేంద్ర! యీతఁడు ధరణీసురుఁడుఁ గాడు; దేవకార్యంబు సాధించుకొఱకు
హరి విష్ణుఁ డవ్యయుం డదితిగర్భంబునఁ; గశ్యపసూనుఁ డై గలిఁగె; నకట;
యెఱుఁగ వీతని కోర్కె నిచ్చెద నంటివి; దైత్య సంతతి కుపద్రవము వచ్చు
నీ లక్ష్మిఁ దేజంబు నెలవు నైశ్వర్యంబు; వంచించి యిచ్చును వాసవునకు;
మొనసి జగము లెల్ల మూఁడుపాదంబుల
నఖిలకాయుఁ డగుచు నాక్రమించు
సర్వధనము విష్ణు సంతర్పణము చేసి
బడుగు పగిది యెట్లు బ్రతికె దీవు?
వారిజాక్షులందు వైవాహికములందుఁ
బ్రాణ విత్త మాన భంగమందుఁ
జకిత గోకులాగ్రజన్మ రక్షణమందు
బొంకవచ్చు నఘము పొందఁ దధిప!
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వా రేరీ సిరి మూటఁగట్టుకొని పోవంజాలిరే? భూమిపైఁ
బే రైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాము లై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!
ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనవుపై, నంసోత్తరీయంబుపై,
బాదాబ్జంబులపైఁ, గపోలతటిపై, బాలిండ్లపై నూత్న మ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁ దై నా కరం బుంట మే
ల్గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?
ఎన్నడుం బరు వేఁడఁబోఁడట; యేకలం బఁట; కన్న వా
రన్నదమ్ములు నైన లేరఁట; యన్నివిద్యల మూలగో
ష్ఠిన్నెఱింగిన ప్రోడగు జ్జఁట; చేతు లొగ్గి వసింప నీ
చిన్నిపాపనిఁ ద్రోసిపుచ్చఁగ జిత్త మొల్లదు సత్తమా!
ఇంతిం తై, వటుఁ డింత యై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లం తై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంత యై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై.
రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై శిరోరత్న మై
శ్రవణాలంకృత మై గళాభరణ మై సౌవర్ణకేయూర మై
ఛవిమత్కంకణ మై కటిస్థలి నుదంచద్వస్త్ర మై నూపుర
ప్రవరం బై పదపీఠ మై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.