ప్రథమ స్కంధం

ప్రార్థన

1- 1 శ్రీకైవల్యపదంబు...(శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారంభకు భక్తపాలనకళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళిలోలవిలసనద్దృగ్జాలసంభూతనా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్

iBAT సందర్భం

తెలుగుల పుణ్యపేటి బమ్మెర పోతన శ్రీమద్భాగవత అమృతాన్ని తెలుగుజాతికి అందించటానికి పూనుకొని ముందుగా నందాంగనా డింభకుడైన శ్రీకృష్ణపరమాత్మను హృదయంలో నిలుపుకుంటున్నాడు. మనలను కూడా నిలుపుకోమంటున్నాడు.

iBAT తాత్పర్యము

మహానందుడనే పుణ్యాత్ముని ఇల్లాలు యశోద. ఆ ఇద్దరినీ అనుగ్రహించటానికి వారి ముద్దుబిడ్డడుగా వారిని చేరుకున్నాడు కన్నయ్య. ఆ మహాత్ముడు అనుగ్రహించే కైవల్యపదం 'శ్రీ' తో కూడినది. 'శ్రీ' అంటే లోకాలను, లోకులను - సర్వాన్నీ నడిపించే మహాశక్తి. దానితో కలిసి ఉండే మోక్ష సామ్రాజ్యమే శ్రీకైవల్య పదం. దానికోసం శ్రీకృష్ణవాసుదేవుని నిరంతరమూ ధ్యానిస్తూ ఉంటాను.ఆ పసిబిడ్డ లోకాలను రక్షించటం అనే ఒకేఒక్క కార్యం కలవాడు. భక్తులను కాపాడటం అనే కళలో తొందరతనం కలవాడు. రక్కసుల పొగరును నిలువరించే సామర్థ్యం కలవాడు. ఆటలలో అందంగా కదలాడుతున్న చూపుల సముదాయంతో రూపొందిన అనేక బ్రహ్మాండాలనే కుండలు గలవాడు. అట్టి బాలగోపాలుని మనస్సులో ధ్యానిస్తూ ఉంటాను.
1- 2 వాలిన భక్తి... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజాముఖపద్మ మయూఖమాలికిన్
బాల శశాంక మౌళికిఁ గపాలికి మన్మథ గర్వపర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్యమనస్సరసీరుహాళికిన్.

iBAT సందర్భం

తన భాగవత రచన సకల శుభపరంపరలతో సాగాలని మహాభక్త శిఖామణి అయినటువంటి పోతన సర్వజ్ఞుడైన శ్రీ శంకరుని వైభవాన్ని సంభావిస్తూ ఇలా ప్రార్థిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

నేను అతిశయించిన భక్తితో పరమశివునకు మ్రొక్కుతాను. ఆ శివుడు ఎవరికీ నిలువ రించటానికి సాధ్యం కాని తాండవనృత్యం ఆటగా గలవాడు. సర్వప్రాణులయందూ దయ తో అలరారేవాడు. శూలం కలవాడు. పర్వతరాజతనయ మోము అనే తామరపూవునకు కిరణాల మాలలుగల భాస్కరుడు అయినవాడు. చిన్నిచందమామను తలపై పూవుగా తాల్చినవాడు. బ్రహ్మ తలను గోటితో గిల్లి ఆ పుఱ్ఱెను విలాసంగా చేతిలో ధరించి తిరు గాడుతూ ఉండేవాడు. మన్మథుని గర్వం ఒక పెద్దపర్వతం వంటిది మన్మథుని గర్వం. దానికి అందరూ అణగి మణగి ఉండటం తప్ప మరొక దారిలేదు. అటువంటి గర్వపర్వతాన్ని అవలీలగా పెల్లగించి పారవేసినవాడు. నారదుడు మొదలైన జ్ఞానసంపన్నుల హృదయ పద్మాలలో మనోజ్ఞమైన నాదం చేస్తూ తిరుగాడే తుమ్మెద వంటివాడు
1- 3 ఆతత సేవ... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఆతతసేవఁ జేసెద సమస్తచరాచర భూతసృష్టివి
జ్ఞాతకు భారతీహృదయసౌఖ్యవిధాతకు వేదరాశి ని
ర్ణేతకు దేవతానికరనేతకుఁ గల్మషజేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిలతాపసలోక శుభప్రదాతకున్.

iBAT సందర్భం

నాలుగుమోముల దేవర బ్రహ్మయ్య. జ్ఞానవిజ్ఞానాల స్వరూపమైన సరస్వతి వేదాల రూపంతో ఆయన నాలుగుమోములలోనూ నిరంతరం కదలాడుతూ ఉంటుంది. తన నోటి నుండి భాగవత పరమార్థం రసాత్మకంగా వెలువడాలంటే ఆ పరమేష్ఠి అనుగ్రహం కూడా కావాలి. అందువలన పోతన తన మధుర మంజుల వాక్కులతో బ్రహ్మను కొనియాడు తున్నాడు.

iBAT తాత్పర్యము

ఆయన ధాత. సకలసృష్టినీ పట్టి నిలిపేవాడు. ఆ సృష్టిలో కదలాడేవీ, కదలాడనివీ అయిన రెండు విధాల భూతాలున్నాయి. వాటి తీరుతెన్నులన్నింటినీ మొత్తంగా తెలిసినవాడు. చదువులతల్లి హృదయానికి సౌఖ్యం కూర్చే జ్ఞానసంపద ఆయన సొమ్ము. వేదాల రాశులను ఇదీ అదీ అని నిర్ణయించి జనులకు తెలివితేటలను ప్రసాదించినవాడు. ఇంద్రుడు మొదలైన దేవతలందరినీ వారివారి విధులలో నడిపించే నాయకుడు. పాపాలు ఏమాత్రమూ తననంటకుండా పరిశుద్ధుడై ప్రకాశిస్తున్నవాడు. తనయెడల వినయంతో ఉన్నవారందరినీ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. తమ తపశ్శక్తితో ఈ భూమినంతటినీ పట్టి నిలుపుతున్న తాపసులందరికీ శుభాలను ప్రదానం చేస్తూ ఉండేవాడు. అట్టి బ్రహ్మదేవునకు చాలాపెద్ద ఎత్తున పూజ చేస్తాను.
1- 5 ఆదర మొప్ప... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఆదరమొప్ప మ్రొక్కిడిదు నద్రిసుతాహృదయానురాగ సం
పాదికి దోషభేదికి బ్రపసన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నందవేదికిన్
మోదక ఖాదికిన్ సమద మూషకసాదికి సుప్రసాదికిన్.

iBAT సందర్భం

బ్రహ్మ మొదలైన దేవతలు కూడా తమ తమ పనులు ప్రారంభించేటప్పుడు అతనికి మ్రొక్కి కృతకృత్యులవుతారట. ఇంక మానవుల సంగతి చెప్పనేల? కాబట్టి ఉత్తమ పురుషు డైన పోతనామాత్యుడు భాగవత రచనా మహాకార్యంలో తనకు ఏవిధమైన విఘ్నాలూ కలుగ కూడదని గజాననునికి మ్రొక్కులు చెల్లిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

ఆ మహాత్ముడు అమ్మ పార్వతీదేవి హృదయపు అనురాగాన్ని నిరంతరం సంపాదించుకుంటాడు. చెడుపనులను చీల్చి చెండాడుతాడు. తానే దిక్కని నమ్ముకొన్నవారిని ఉల్లాసపరుస్తూ ఉంటాడు. విఘ్నములు అనెడి చిక్కుముడులుగల లతలను త్రెంపివేస్తాడు. పరమ మనోజ్ఞమైన పలుకులతో అందరికీ ఆనందం కలిగిస్తాడు. అన్నిలోకాలలో ఉండే ప్రాణుల ఆనందాన్ని ఎరిగినవాడు. కుడుములను ఆప్యాయంగా ఆరగించేవాడు. పొగరెక్కిన ఎలుక వాహనంగా కలిగినవాడు. సర్వప్రాణికోటియందూ ప్రసన్నత కలవాడూ అయిన గణపయ్యకు మ్రొక్కుతాను
1- 6 క్షోణితలంబు... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
క్షోణితలంబు నెన్నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయసుందరవేణికి రక్షి తామర
శ్రేణికిఁ దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్.

iBAT సందర్భం

హృదయంలో భవ్యమైన భావన కదలాలంటే ఆ తల్లి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. ఆ భావన పలుకుగా రూపం దిద్దుకొని నాలుకపై నాట్యమాడాలంటే ఆయమ్మ చల్లనిచూపు జాలువారాలి. అందునా పలుకబోయేది భాగవతం. దానికై చదువుల తల్లి సరస్వతి సదమలకృప సమృద్ధిగా కావాలి. పోతన ఆమె దయకోసం ప్రార్థిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

నా విశాలమైన ఫాలభాగం నేలకు చక్కగా తాకించి తల్లికి మ్రొక్కుతాను. నోరారా ఆ సరస్వతీమాతను పలుకులతో కొనియాడతాను. ఆమె ఇసుకతిన్నెవంటి పిరుదుల భాగంతో విశ్వాన్నంతటినీ నింపుకున్నదా అన్నట్లున్నది. కదలాడుతున్న తుమ్మెదల బారులుగా కన్పిస్తున్న అందమైన కేశసౌభాగ్యంతో గగనాన్నంతటినీ ప్రకాశింప జేస్తున్నది. అందరినీ ఆనందపరచే అమరగుణాలతో అలరారే ఉత్తములను కాపాడుతూ ఉంటుంది. అన్ని లోకాలకూ చివరిదైన సత్యలోకంలో సృష్టికార్యంలో తలమున్కలుగా ఉన్న బ్రహ్మదేవుని చిత్తాన్ని వశం చేసుకొనే వాక్కులతో విరాజిల్లుతున్నది. జపమాల, చిలుక, తామరపూవూ, పుస్తకమూ నాలుగు చేతులలో చక్కగా పట్టుకొని నా యెదుట సాక్షాత్కరిస్తున్నది
1- 7 పుట్టం బుట్ట...(శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
పుట్టంబుట్ట, శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్
మెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నాకీవమ్మ యో! యమ్మ మేల్
పట్టున్మానకు మమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!

iBAT సందర్భం

అహంకారం పతనానికి కారణం. వినయం సమున్నత శిఖరాలను ఎక్కిస్తుంది. భాగవతం తెలుగులో వ్రాయాలని సంకల్పించిన మహావ్యక్తి పోతన తనలోని అహంకారాన్ని సమూలంగా దులిపివేసుకుని, వినయాన్ని ప్రోది చేసుకుని చదువుల తల్లితో ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

అమ్మా! బ్రహ్మదేవుని యిల్లాలా! సముద్రంలో జలం ఎంత ఉంటుందో నీలో దయ అంత ఉంటుంది. కనుక నా విన్నపం విఫలం కాదనే నమ్మకంతో నిన్ను ప్రార్థిస్తు న్నాను. నేను పుట్టలో పుట్టినవాడను కాదు. అలా పుట్టిన వాల్మీకి శ్రీమద్రామాయణం రచించాడు. రెల్లుతోటలో పుట్టిన కుమారస్వామినీ కాను. ఆయన మహాసారస్వత నిర్మాత. ఓడలో పయనించి ద్వీపం చేరుకొన్న పరాశరుని దయచేత అక్కడ ఉదయించిన వ్యాసుడనూ కాను. కాళీమాతను పూజించిన కవికులగురువు కాళిదాసుడను కాను. అయినా పురాణ రచనకు పూనుకొన్నాను. ఇకమీద ఏవిధంగా నడచుకోవాలో ఆ మార్గాన్ని నీవు నాకు అనుగ్రహించు. నీవు అమ్మవు కదా! నాకు చేయూతనివ్వటం మానకు, తల్లీ. అమ్మా! నేను నిన్నే నమ్ముకొన్నాను.
1- 8 అమ్మలఁ గన్న యమ్మ... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడుపాఱడివుచ్చినయమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యీవుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.

iBAT సందర్భం

"దుర్గామ్ దేవీం శరణ మహం ప్రపద్యే" అనమంటున్నది వేదమాత. 'నేను దుర్గాదేవి శరణు పొందుతాను' అనుకుంటూ ఆ పని చేయాలి. ఈ వేదవాక్యం వలన కలిగిన సంస్కారంతో పోతన మహాకవి దుర్గా దేవిని స్తుతిస్తూ, తెలుగు వారందరినీ కూడా ఈ పద్యం చదువుకొని తరించమంటున్నాడు.

iBAT తాత్పర్యము

దుర్గాదేవి మాయమ్మ. మాయకు అమ్మ. అంటే పరబ్రహ్మ స్వరూపం. కృపాబ్ధి, కృపకు సముద్రం అయినది. అంటే నిలువెల్లా దయయే అయిన తల్లి. ఆ మల – ఆ హిమగిరి – కన్న అమ్మ. పర్వతరాజ తనయగా అవతరించి లోకాలకు కన్నతల్లి అయినది. భారతి, ఉమ, రమ‍ అనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలైన ముగ్గురమ్మలకు మూలమైన ఆదిశక్తి దుర్గమ్మ. అందువలనే సనాతని కనుక చాలా పెద్దఅమ్మ. దేవీ భావనలకు పగవారైన రాక్షసుల అమ్మల కడుపును పనికిమాలినదిగా చేసి లోకాలను కాపాడే అమ్మ. హృదయం లోపలి సన్నని వరిముల్లువంటి రంధ్రంలో నిలుపుకొని నమ్మి కొలిచే దివ్యత్వం కల మాతృభావంతో ఉండేవారి మనస్సులనే ఆలయాలలో అలరారే అమ్మ. . ఆ అమ్మ మాకు ఎంతో సమున్నతమైన విలువలుగల కవిత్వంలోని పాటవానికి సంబంధించిన సంపదలను ప్రసాదించుగాక.
1- 9 హరికిం బట్టపుదేవి... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
హరికిన్ బట్టపుదేవి, పున్నెములప్రోవర్థంబుపెన్నిక్క చం
దరుతోఁ బుట్టువు, భారతీగిరిసుతల్ తోనాడు పూబోణి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించునిల్లాలు, భా
సురతన్ లేములు వాపుతల్లి సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.

iBAT సందర్భం

ఆ లక్ష్మీదేవిని లోకమాత అంటారు. సమస్త ప్రాణికీ అమ్మలాగా సర్వమూ అనురాగంతో అమర్చిపెట్టే వెలుగుల తల్లి. నిజానికి ఆమె బిడ్డలకు అడగకపోయినా అన్నీ సమకూరుస్తుంది. . పోతనామాత్యులు ఇందిరా మాతను ఇలా ప్రార్థిస్తున్నారు .

iBAT తాత్పర్యము

శ్రీమహావిష్ణువునకు పట్టపురాణి, పుణ్యాలరాశి, సంపదలకు పెద్దనిధి. ప్రాణులందరి మూడు కరణాలకూ పరమానందం అందించే చందురుని అక్కగారు. చదువులతల్లి అయిన భారతి, జ్ఞానప్రసూన అయిన గిరిజ ఆమెకు ఇష్టసఖులు తమ వికాసంతో జనుల హృదయాలను వికసింపజేసే తామరపూవులలో నివసించే ముద్దరాలు. లోకాలన్నీ పూజించే యిల్లాలు. అద్భుతంగా కాంతులను విరజిమ్ముతూ జనుల లేములను పోగొట్టే తల్లి ఆమె మనకు అనంతమైన కల్యాణాలను ఇస్తుంది.
1- 9A శారద నీర దేందు... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
శారదనీరదేందు ఘనసార పటీర మరాళమల్లికా
హారతుషారఫేన రజతాచల కాశఫణీశ కుందమం
దార సుధాపయోధి సితతామరసామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ!

iBAT సందర్భం

దివ్యత్వాన్ని సాధారణమైన కన్నులతో చూడలేము. భావన అనే నేత్రంతోనే చూడాలి. అలా చూడటం గొప్ప తపశ్శక్తితో గానీ సాధ్యం కాదు. శ్రీభారతీదేవి దివ్యదర్శనంకోసం ఆర్తితో విన్నవించుకుంటున్నారు పోతనామాత్యులు

iBAT తాత్పర్యము

"సర్వశుక్లా సరస్వతీ" సరస్వతి నిలువెల్లా తెల్లదనంతో అలరారుతుంది అని ఋషుల భావన. లోకంలో తెల్లదనంతో విరాజిల్లే పవిత్ర వస్తువులు కొన్నింటిని ఉపమానాలుగా సరస్వతీ స్వరూపాన్ని సంభావిస్తున్నారు పోతనామాత్యులు. శరత్కాలమేఘం, చందమామ, కర్పూరం, నీటినురుగు, వెండికొండ, రెల్లుపూలుమొల్లలు, మందారాలు, అమృతసముద్రం, తెల్లని తామరలు, దేవతలనది మందాకిని - అనేవాని శుభమైన ఆకారంవంటి ఆకారంతో ప్రకాశించే ఓతల్లీ! భారతీ! నిన్ను హృదయం అనే గుడిలో ప్రతిష్ఠించుకొని చూడగలగటం ఎన్నటికి సాధ్యమవుతుందో కదా?
1- 9B అంబ నవాంబు జోజ్వల... (ఉత్పలమాల). .
iBAA పద్య గానం
iBAP పద్యము
అంబ! నవాంబుజోజ్జ్వలకరాంబుజ! శారదచంద్రచంద్రికా
డంబరచారుమూర్తి! ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ! శ్రుతిసూక్తవివిక్త నిజప్రభావ! భా
వాంబరవీథి విశ్రుతవిహారి! ననుం గృప జూడు భారతీ!

iBAT సందర్భం

కవిత్రయంలో మూడవవాడు ఎఱ్ఱాప్రగడ. . అత్యద్భుతమైన వినయశీలంగల మహాకవి. అతడు అమ్మ భారతిని పరమసుందరంగా ప్రార్థించిన పద్యం ఇది. పోతన మహాకవి ఆపద్యం అందానికి అబ్బురపడి, ఆనందపడి, అది తన భాగవత మహాకావ్యంలో తిలకంలాగా ఉండాలని కోరుకొని చేర్చుకున్నాడనుకుంటారు పోతన సచ్ఛీలం ఎరిగిన సహృదయులు.

iBAT తాత్పర్యము

అమ్మా! భారతీ! అప్పుడప్పుడే వికసిస్తున్న పద్మపుకాంతులతో వెలిగిపోతున్న, పద్మంవంటి చేతితో అలరారుతున్నావు. శరత్కాలపు చందమామ వెన్నెలల జిలుగులవంటి మనోహరమైన ఆకృతితో మమ్ములను ఆహ్లాదపరుస్తున్నావు. నీవు ధరింపగా విస్పష్టంగా కానవస్తున్న నగలలోని రత్నాల కాంతులు దిక్కుల అంచులను సుకుమారంగా తాకుతున్నాయి. నీదయిన ప్రభావాన్ని వేదసూక్తాలు విస్పష్టంగా వివరించి మానవులకు జ్ఞానసంపదను హాయిగా అందిస్తున్నాయి. నీవు మా భావం అనే గగనవీథిలో నాదరూపంలో తెలియవస్తూ విహరిస్తూ ఉంటావు. నన్ను దయజూడు తల్లీ!
1- 9C కాటుక కంటి...(ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
కాటుక కంటినీరు చనుకట్ట పయింబడ నేల యేడ్చెదో
కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల! ఓ మదంబ! ఓ
హాటకగర్భురాణి! నిను నా కటికిం కొనిపోయి అల్ల క
కర్ణాట కిరాట కీచకుల కమ్మ, త్రిశుద్ధిగ నమ్ము భారతీ!

iBAT సందర్భం

పోతన మహాకవీంద్రులకు చదువులతల్లి సాక్షాత్కరించింది. ఆమె దర్శనం ఆయనకు ఆనందపారవశ్యం కలిగించలేదు. గుండెను తల్లడిల్లజేసింది. ఆ భారతితో ఈ భారతీపరిచారకుడు ఇలా అంటున్నాడు

iBAT తాత్పర్యము

అమ్మా! నా తల్లీ! భారతీ! నీవు కైటభుడనే కరకు గుండెగల రక్కసుని అణచి వేసిన శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన కోడలివి. కడుపంతా కనకమే అయిన నాలుగు మోముల దేవరకు రాణివి. కాటుకతో మలినమైన కన్నీరు పైటమీద జాలువారే తీరుగా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నేను మూడు కరణాలనూ పరిశుద్ధంగా చేసికొని మాట ఇస్తున్నాను. నీవే అయిన నా యీ వాగ్దేవిని తీసుకొనిపోయి పరమ నికృష్టులైన కర్ణాటులు, కిరాటులు, కీచకులు అనే పాడుబుద్ధులు గల పార్థివులకు, ఆకలి తీర్చుకోవటంకోసం అమ్ముకోనమ్మా! ఈ నామాట నమ్ము.
1-11 ఇ మ్మనుజేశ్వరాధముల కిచ్చి... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
సొమ్ములు గొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే
సమ్మెటపోటులం బడక సన్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నీ
బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్.

iBAT సందర్భం

తనకు పూర్వం కొందరు కవులు తమ సుఖభోగాలకోసం కావ్యాలను రాజులకు అంకితం పేరుతో అమ్ముకున్నారు. పోతనకు అది పరమనీచమైన పని అని అనిపించింది. అంతేకాదు, ఆ పాడుపనికి యముడు అతిఘెరంగా శిక్షిస్తాడనికూడా ఆయన మనస్సు చెబుతున్నది. తానా పాతకానికి ఒడిగట్టనని ప్రతిజ్ఞ చేస్తున్నాడు.

iBAT తాత్పర్యము

సాధారణంగా రాజ్యాలేలేవాళ్ళు నీచులై ఉంటారు. ‘చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష’ అనే భావనతో బ్రదకటమే ఆనీచత్వం. కానీ తాము గొప్పవారుగా లెక్కకెక్కాలి అని కూడా వారి ఉబలాటం. దానికోసం కవులకు ఏదో విదిలిస్తూ కృతిభర్తలుగా కీర్తిపొందాలనే దాహం వారికి ఉంటుంది. ఈ బమ్మెరపోతరాజు అటువంటి రాజులు ఇచ్చే అగ్రహారాలనూ, ఏనుగులూ, గుఱ్ఱాలూ మొదలైన వాహనాలనూ, ధనాన్నీ కోరడు. ఎందుకంటే అవన్నీ ప్రాయంలో బాగానే ఉంటాయి. ముసలితనం వచ్చినప్పుడు అవే ముప్పుతిప్పలు పెడతాయి. శరీరం పోయిన తరువాత కాలుడు ఈ పాపానికి శిక్షగా సహింపనలవికాని సమ్మెట పోటులతో సత్కరిస్తాడు. ఆ శిక్షను పొందకుండా శ్రీమహావిష్ణువునకు అంకితంగా సమస్త జగత్తుకూ మేలుకలిగే విధంగా భాగవతాన్ని ఈ బమ్మెరపోతరాజు ‘ఒక్కడు’ చెబుతున్నాడు.
1-12 చేతులారంగ... (తేటగీతి).
iBAA పద్య గానం
iBAP పద్యము
చేతులారంగ శివుని పూజింపడేని
నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా దలపడేని
గలుగనేటికి దల్లులకడుపుచేటు.

iBAT సందర్భం

మానవుడు నిజమైన మానవుడు కావాలంటే కొన్ని విశిష్ట లక్షణాలను పెంపొందించుకోవాలి. అలాకాకపోతే వాని పుట్టుకకు ఒక ప్రయోజనం ఉన్నదని నిరూపించు కోలేడు. అప్పుడు అతడు పశువుకన్నా హీనుడైపోతాడు. ఆ విశిష్ట లక్షణాలను ప్రకటిస్తూ పోతన తన పుట్టుకను తాను ఏవిధంగా ఉదాత్తంగా రూపొందించుకునే యత్నం చేస్తున్నాడో చెప్పటం ద్వారా లోకానికి ఒక ఉపదేశం చేస్తున్నాడు.

iBAT తాత్పర్యము

మానవుడు నిజమైనమానవుడు కావాలంటే కొన్ని విశిష్టలక్షణాలను పెంపొందించు కోవాలి. అలాకాకపోతే వాడు పుట్టుకకు ఒకప్రయోజనం ఉన్నదని నిరూపించుకోలేడు. వాడు పశువుకన్నా హీనుడైపోతాడు. ఆవిశిష్టలక్షణాలను ప్రకటిస్తూ పోతన తనపుట్టుకను తాను ఏవిధంగా ఉదాత్తతరంగా రూపుదిద్దుకొనే యత్నం చేస్తున్నాడో చెప్పటం ద్వారా లోకానికి ఒక ఉపదేశం చేస్తున్నాడు.

నమకచమకాలు పఠిస్తూ శివునికి అభిషేకం చేస్తాము. లేదా వేయి నామాలు చదువు కుంటూ పూలతో శివుని పూజిస్తాము. కొంతసేపటికి చేతులు ఆశ్రమను తట్టుకోలేక అభిషేకా నికో, పూజకో మొరాయిస్తాయి. దీక్షకలవాడు ఆమొరాయింపునకు లొంగిపో కూడదు. చేతులను శిక్షించి అయినా పూజను తుదియుట్టా పూర్తిచేయాలి. చేతులారంగ శివుని పూజిం చటం అంటే అది. అలాగే ఏ విష్ణుస్తోత్రాలో, సహస్రనామాలో చదువుతూ ఉంటే నోరు కొంతసేపటికి నొప్పి పొందుతుంది. అలా అయినప్పుడు పఠనాన్ని ఆపివేయగూడదు. నోటిని నొప్పించి అయినా హరికీర్తిని ఆదరంతో అంటూనే ఉండాలి. అలాగే దయ, సత్యం మొదలైన ఉత్తమగుణాలయందు మనసును కుదురుకొల్పాలి. అప్పుడే పుట్టుకకు సార్థకత. అలా కాకపోతే తల్లికడుపును చెరచటానికే పుట్టినట్లవుతుంది.
1-16 మెఱుగు చెంగట... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మెఱుగు చెంగట నున్న మేఘంబుకైవడి ఉవిద చెంగటనుండ నొప్పువాడు
చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిఱునవ్వు మొలచువాడు
వల్లీయుతతమాల వసుమతీజము భంగిబలువిల్లు మూపున పరగువాడు
నీలనగాగ్ర సన్నిహిత భానునిభంగి ఘనకిరీటము దల గల్గువాడు

(ఆటవెలది).

పుండరీకయుగము పోలు కన్నులవాడు
వెడద యురమువాడు విపులభద్ర
మూర్తివాడు రాజముఖ్యు డొక్కరుడు నా
కన్నుగవకు నెదర గానబడియె.

iBAT సందర్భం

పోతనమహాకవి ఏదైనా శ్రీమన్నారాయణ కథను కావ్యంగా రచించాలనే ఉత్సాహంతో ఉన్నాడు. ఒక పున్నమినాడు చంద్రగ్రహణ సమయంలో గంగను చేరుకొని పుణ్యస్నానం ఆచరించి మహేశ్వర ధ్యానం చేస్తూ ఉన్నాడు. అప్పుడాయనకు శ్రీరామభద్రమూర్తి అరమోడ్పు కనులలో సాక్షాత్కరించాడు. పోతనమహాకవి ఆ మూర్తిని మన కన్నులకు ఇలా కట్టిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

మెఱుపుతీగను అంటిపెట్టుకొని ఉన్న మేఘంలాగా జానకీకాంత చెంగట ఉండగా వెలిగిపోతున్నాడు. మోమున చిన్నినవ్వు పుట్టుకొని వస్తున్నది. అది చంద్రబింబంనుండి వెలువడే అమృతపు జల్లుగా ఉన్నది. పెద్ద విల్లు భుజంమీద అలరారుతూ ఉంటే లత చుట్టుకొన్న పెద్ద చెట్టులాగా ప్రకాశిస్తున్నాడు. నల్లనికొండ పరిసరాలలో ఉదయిస్తున్న సూర్యునిలాగా రత్నాల కిరీటం తలపైన కుదురుకొని ఉన్నది. చక్కగా వికసించిన తెల్లని తామరల జంటలాగా ఆ మహానుభావుని కన్నులు కాంతులను జిమ్ముతున్నాయి. విశాలమైన వక్షఃస్థలం అతని హృదయ వైశాల్యాన్ని స్ఫురింపజేస్తున్నది. ఏ వైపునుండి చూచినా మంగళమూర్తియే అయి అలరారుతున్నాడు. అట్టి రాజముఖ్యుడొకడునా కన్నులయెదుట కానవచ్చాడు.
1-18 పలికెడిది భాగవత మఁట... (కందము)
iBAA పద్య గానం
iBAP పద్యము
పలికెడిది భాగవత మట;
పలికించు విభుండు రామభద్రుండట; నే
పలికిన భవహర మగునట
పలికెద వేఱొండుగాధ పలుకగ నేలా.

iBAT సందర్భం

శ్రీరామచంద్రుడు నాపేరు పేర్కొంటూ శ్రీమహాభాగవతాన్ని తెలుగు చేయవయ్యా! దానితో నీ భవబంధాలన్నీ పటాపంచలయిపోతాయి అని పోతన కవీంద్రునితో అన్నాడు. ఆ మహాకవికి పరమానందం కలిగింది. ఆ భావననుండి ఆ మహాకవి నోట అద్భుతమైన పద్యం వెలువడింది.

iBAT తాత్పర్యము

ఏమిటేమిటి? నేను పలుకబోతున్నది భగవంతుని అమృతంవంటి చరిత్రమట! ఏదో నేను పలుకుతున్నాననుకొంటున్నాను, కానీ నన్ను పలికించేవాడు సాక్షాత్తూ పరమాత్మయే అయిన ఆ రామభద్రుడట! పలికితే కలిగే ఫలం సంసారం అనే ఘోరమైన దుఃఖాన్ని పోగొట్టుకోవటమే అట! అటువంటి కార్యమూ, ఆ విధంగా చేయించే స్వామి! అంత అనితరసాధారణమైన ఫలమూ సమకూరుతూ ఉండగా మఱొక గాధను పలుకవలసిన పనియేమున్నది? కాబట్టి భాగవత గాధనే పలికి మహాఫలాన్ని అందుకుంటాను.
1-19 భాగవతము తెలిసి పలుకుట ... (కందము)
iBAA పద్య గానం
iBAP పద్యము
భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు
శూలికైన తమ్మిచూలికైన
విబుధజనుల వలన విన్నంత కన్నంత
తెలియవచ్చినంత తేటపఱతు.

iBAT సందర్భం

కరుణావరుణాలయుడు శ్రీరామచంద్రమూర్తి శ్రీభాగవతాన్ని తెలుగులో వ్రాయవలసినదిగా తనను ఆదేశించాడు. కానీ అదేదో ఆషామాషీ వ్యవహారం కాదని తనకు తెలుసు. దానికి సారస్వత వ్యవసాయం చాలా కావాలి. దానిని లోకానికి తెలియజేస్తున్నాడు పోతన మహాకవి.

iBAT తాత్పర్యము

భాగవతం తత్త్వం తెలియటమే చాలా కష్టమైనపని. తెలిసినదానిని తెలియజెప్పటం కోసం పడవలసినపాట్లు అన్నీయిన్నీ కావు. ఎవరికి? మానవమాత్రునకే కాదు, అటు సర్వజ్ఞమూర్తిగా పేరొందిన శూలికీ, ఇటు నాలుగుమోములతో నాలుగు వేదాలనూ ఉచ్చరించే బ్రహ్మదేవునికీ కూడా . వారిద్దరూ కూడా ఇది చాలా చిత్రమైన విషయంగా భావిస్తారు. మఱి నీవెలా వ్రాస్తావయ్యా అంటారేమో! చక్కని వివేకంతో కూడిన విద్వాంసులవలన విన్నాను. దానిని ఆకళింపునకు తెచ్చుకున్నాను. ఆ రెండు సంస్కారాల వలన నా బుద్ధికి తోచిన దానిని ధ్యానరూపంతో నిలుపుకొని అందరికీ అర్థమయ్యేటట్లు అక్షరాలలో నిక్షేపిస్తాను.
1-21 ఒనరన్ నన్నయ తిక్క నాది... (మత్తేభం)
iBAA పద్య గానం
iBAP పద్యము
ఒనరన్ నన్నయతిక్కనాది కవులీయుర్విన్ పురాణావళుల్
తెనుగున్ జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో
తెనుగున్ జేయరు మున్ను భాగవతమున్; దీనిన్ తెనింగించి నా
జననంబున్ సఫలంబు సేసెద పునర్జన్మంబు లేకుండగన్.

iBAT సందర్భం

పోతన తన అదృష్టాన్ని తానై కొనియాడుకొంటున్నాడు. ఎందుకంటే తనకు పూర్వులైన నన్నయతిక్కనాదులు భాగవతం జోలికి పోలేదు. అట్టి తన భాగ్యాన్ని పైకి సంభావించుకుంటూ లోపలలోపల మహాకవుల మహోన్నత వైభవాన్ని లోకానికి తెలియజేస్తున్నాడు.

iBAT తాత్పర్యము

అసమాన ప్రతిభగల నన్నయ, తిక్కన మొదలైన మహాకవులు పురాణాల సముదాయాలను తెలుగులో రచించటానికి పూనుకున్నారు. కానీ నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యాలపంట ఎటువంటిదో కానీ భాగవతం వారు రచించలేదు. . అది నాకోసమే అన్నట్లుగా మిగిల్చారు. కనుక నేను భాగవతాన్ని తెలుగుకావ్యంగా రచించి నా పుట్టుక సఫలం అయ్యేట్లు చేసుకుంటాను. దీనితో నాకు పునర్జన్మే లేనటువంటి మహాభాగ్యం కలుగుతుంది.
1-22 లలిత స్కంధము... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
లలితస్కంధము, గృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జులతా శోభితమున్, సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వల వృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై.

iBAT సందర్భం

భాగవతం ఒక కల్పవృక్షంలాగా కనపడుతున్నది పోతన మహాకవీంద్రునకు. కల్పవృక్షం కోరిన కోరికలనన్నింటినీ తీర్చి ఆనందాన్నందిస్తుంది. భాగవతం కూడా అటువంటిదే అని పోతన గారి సంభావన.

iBAT తాత్పర్యము

ఇదిగోనండీ భాగవతమనే కల్పవృక్షం. ఈ వృక్షం బోదె చాలా సుకుమారంగా ఉంటుంది. అలాగే భాగవతంలో స్కంధాలు లలితంగా ఉంటాయి. ఆ చెట్టుమూలం సారవంతమైన నల్లరేగడి మట్టితో ఉన్నట్లుగా భాగవతం నల్లనయ్యయే మూలంగా ఒప్పారుతున్నది. చిలుకలు కమ్మని నాదాలతో చెట్టును మనోహరం చేస్తాయి. ఈ భాగవతం శుకమహర్షి ఆలాపాలతో హృదయంగమంగా అలరారుతున్నది. చెట్టునల్లుకొని పూలతీగలు దాని సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి. భాగవతం మంజులత్వం తో ప్రకాశిస్తూ ఉంటుంది. కనువిందు చేసే రంగురంగుల పూవులతో అందరినీ ఆకర్షిస్తుందీ వృక్షం. ఈ భాగవత వృక్షం మంచి అక్కరాలతో గొప్ప హృదయసౌందర్యం కలవారికి చక్కగా తెలియవస్తుంది. అందమైన కాంతులు విరజిమ్ముతూ ఉండే పాదు ఈ చెట్టును అలంకరిస్తున్నది.. అందమైనవీ, వెలుగులు చిమ్ముతున్నవీ అయిన ఛందస్సునందలి వృత్తాలు ఈ భాగవతంలో ఉన్నాయి. స్వచ్ఛమైనదీ, వెడల్పైనదీ అయిన పాదు ఈ వృక్షానికి ఉన్నది. స్వచ్ఛమైన హృదయం గల వ్యాసుల వారే భాగవతానికి జన్మభూమి. వృక్షం గొప్ప ఫలాలను లోకానికి అందిస్తుంది. ఈ భాగవతం గొప్పదైన మోక్షం అనే ఫలాన్ని ఇస్తుంది. ఆ చెట్టును ఆశ్రయించి మంచి పక్షులు బ్రతుకుతూ ఉంటాయి. ఈ భాగవతం సత్-ద్విజులకు, అంటే ఉత్తమ సంస్కారం కల పండితులకు, ఆశ్రయింపదగినదై విరాజిల్లుతున్నది.

షష్ఠ్యంతములు

1-29 హారికి నందగోకుల విహారికిఁ... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
హారికి నందగోకులవిహారికి చక్రసమీరదైత్య సం
హారికి భక్తదుఃఖపరిహారికి గోపనితంబినీమనో
హారికి దుష్టసంపదపహారికి ఘోషకుటీపయోఘృతా
హారికి బాలకగ్రహ మహాసురదుర్వనితాప్రహారికిన్.

iBAT సందర్భం

మన కావ్యాలలో ఒక సంప్రదాయం ఉన్నది. కవి తన కావ్యాన్ని ఎవనికి అంకితం ఇస్తున్నాడో అతని మహిమలను పేర్కొంటూ కొన్ని పద్యాలను పీఠికలో వ్రాస్తాడు. ఆ విశేషణాలన్నీ షష్ఠీవిభక్తితో అంతమౌతూ ఉంటాయి. కనుక వానిని షష్ఠ్యంతాలు అంటారు. పోతన కవీంద్రుడు ఆ షష్ఠ్యంతాలతో శ్రీకృష్ణచంద్రుని స్తుతిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

ఆ చిన్నారి కన్నయ్య అందరి హృదయాలను అలరింపజేసే అందగాడు. నందుని గోకులంలో విహారాలు చేసేవాడు. సుడిగాలిరూపంలో వచ్చిన రక్కసుని మక్కెలు విరగదన్ని చంపినవాడు. భక్తుల దుఃఖాన్ని తొలగించే దయామూర్తి. గోపకాంతల మనస్సులను దొంగిలించే మహనీయుడు. చెడుగుణాల సంపదలను నాశనంచేసే మహాత్ముడు. గొల్లభామలు కుటీరాలలో దాచుకున్న పాలూ, నెయ్యీ మొదలైన వానిని కొల్లగొట్టిన వెన్నదొంగ. బాలకగ్రహ రూపంలో వచ్చిన పాడురక్కసి పూతన ప్రాణాలను చనుబాలతో పాటు పీల్చి చంపివేసిన అద్భుత బాలకుడు. అటువంటి శ్రీకృష్ణచంద్రునకు నా కావ్యాన్ని అంకితం చేస్తున్నాను.
1-30 శీలికి నీతిశాలికి... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్తని
ర్మూలికి ఘోరనీరదవిముక్తశిలాహత గోపగోపికా
పాలికి వర్ణధర్మపరిపాలికి అర్జునభూజయుగ్మ సం
చాలికి మాలికిన్ విపులచక్రనిరుద్ధమరీచిమాలికిన్

iBAT సందర్భం

శ్రీకృష్ణుని మహోన్నతగుణాలను మరింతగా కొనియాడుతూ మురిసి పోతున్నాడు భక్తశిఖామణి పోతన.

iBAT తాత్పర్యము

అందరూ ఆయన మానినీ చిత్తచోరుడంటారు కానీ నిజానికి ఆతడు గొప్ప శీలసంపద కలవాడు. లోకాలన్నిటినీ చక్కగా నడిపించే నీతితో అలరారేవాడు. త్రిశూలాన్ని ధరించిన శ్రీమహాశివుని తన గుండె గుడిలో నిలుపుకొన్న మహాత్ముడు. బాణాసురుని వేయిచేతులనూ విలాసంగా ముక్కలుగా గొట్టిన మహాబలశాలి. చాలా ఉద్ధృతంగా విజృంభించిన రాలవానతో దెబ్బతిన్న గొల్లలనందరినీ భద్రంగా కాపాడిన కృపామూర్తి. వర్ణధర్మాలను కాపాడి లోకాన్ని ఒక త్రాటిమీదన నడిపించే దిట్ట. జంట మద్దిచెట్లను పసితనంలోనే కదిలించి కుదిలించి కూల్చిన ప్రోడ. నిరంతరం పూమాలలను ధరించి వానికి వన్నెతెచ్చిన అందగాడు. తన చక్రంతో సూర్యుని కిరణాల ప్రసారాన్ని అడ్డగించిన సర్వేశ్వరుడు. అతనికి అంకితంగా నా భాగవత మహారచనను ప్రారంభిస్తున్నాను.
1-31 క్షంతకుఁ గాళి యోరగ... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
క్షంతకుఁ గాళియోరగ విశాల ఫణోపరినర్తన క్రియా
రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధఘోర వాహినీ
హంతకు నింద్రనందన నియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియ సమంచిత భక్తజనానుగంతకున్.

iBAT సందర్భం

అనంత కల్యాణ గుణసంపన్నుడైన శ్రీకృష్ణస్వామి భగవల్లక్షణాలను మరింత ఆనందపు పొంగులతో అభివర్ణించి మురిసిపోతున్నాడు పోతన. మనకు కూడా ఆ ఆనందాన్ని అందిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

నల్లని ఆసామి ఎట్టివానినైనా క్షమించే హృదయవైశాల్యం గలవాడు. కాళియ సర్పరాజు విశాలమైన పడగలమీద నర్తనం చేయటం అనే పనిలో ఆనందించేవాడు. పొగరెక్కి మిడిసిపడుతున్న జరాసంధుని రథములు, ఏనుగులు, గుఱ్ఱాలు, కాలుబంటులు అనే నాలుగువిధాలైన సేనలను రూపుమాపినవాడు. ఇంద్రుని కుమారుడైన అర్జునుని రథానికి సారథి అయినవాడు. సమస్తమైన ప్రాణికోటికీ, కదలకుండా నిలిచి ఉండే జడ పదార్థాల సముదాయానికీ భావింపదగినవాడు, ఇంద్రియాలను తమ అదుపులో ఉంచుకొని యోగులైన గొప్పభక్తుల వెంటనంటి మెలగేవాడు. అట్టి నీలవర్ణశోభితుడైన కన్నయ్యకు నా కావ్యాన్ని అంకితం ఇస్తున్నాను.
1-32 న్యాయికి... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన
స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం
ధాయికిఁ బీతవస్త్రపరిధాయికిఁ బద్మభవాండభాండ ని
ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.

iBAT సందర్భం

శ్రీవాసుదేవుని గుణకథనంతో తృప్తి తీరని పోతన, గొప్ప అలంకారాలతో అలరారుతున్న పద్యపుష్పంతో ఇంకా ఇలా కొనియాడుతున్నాడు.

iBAT తాత్పర్యము

శ్రీకృష్ణస్వామి న్యాయప్రవృత్తి కలవాడు. తన గురువైన సాందీపనికి అతని మృతిచెందిన కుమారుని గురుదక్షిణగా సమర్పించిన మహాత్ముడు. రుక్మిణీదేవి హృదయాలయంలో సుస్థిరమైన గూడు కట్టుకొన్నవాడు. ఉత్తమశీలంకల జనులకు అనురాగాన్ని కూర్చేవాడు. చూడముచ్చట అయిన పట్టుపుట్టాన్ని కట్టేవాడు. బ్రహ్మాండములనే భాండములను నిర్మించేవాడు. గోపికల మందిరాలలో తిరుగాడేవాడు. శేషతల్పం మీద సుఖనిద్ర పొందేవాడు. అటువంటి శ్రీకృష్ణునికి అంకితముగా నేను శ్రీమదాంధ్రభాగవతాన్ని రచిస్తున్నాను.

ప్రథమ అధ్యాయం

1-36 శ్రీమంత మై మునిశ్రేష్ఠ కృతం బైన... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన భాగవతంబు సద్భక్తితోడ
వినగోరువారల విమలచిత్తంబుల చెచ్చెర నీశుండు చిక్కుగాక
యితరశాస్త్రంబుల నీశుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు
కపట నిర్ముక్తులై కాంక్షసేయక యిందు తగిలియుండుట మహాతత్వబుద్ధి

(తేటగీతి)

పరగ నాధ్యాత్మికాది తాపత్రయంబు
నడచి పరమార్థభూతమై యఖిలసుఖద
మై సమస్తంబు గాకయు నయ్యునుండు
వస్తు వెఱుగంగదగు భాగవతమునందు.

iBAT సందర్భం

భాగవతం అంటే ఏమిటి? దానినే ఎందుకు అధ్యయనం చేయాలి? అలాచేస్తే కలిగే ప్రయోజ నాలెట్టివి? - ఈ ప్రశ్నలకు పోతనగారు చక్కని సమాధానాలు చెబుతున్నారు.

iBAT తాత్పర్యము

భాగవతం జ్ఞానలక్ష్మితో ప్రకాశిస్తూ ఉంటుంది. మహర్షులలో శ్రేష్ఠుడు శ్రీవేదవ్యాసుడు దానిని రచించినవాడు. గొప్పభక్తితో దానిని వినాలనే కోరికగల నిర్మల చిత్తంగలవారిలో పరమేశ్వరుడు వడివడిగా చేరుకొని అక్కడ స్థిరనివాసం చేస్తాడు. ఇతర శాస్త్రాల వలన అటువంటి మహాఫలం సిద్ధించదు. సత్పురుషులు, మాత్సర్యంలేనివారు, కపట భావాలు లేనివారూ మఱి దేనిని కోరకుండా ఈ భాగవతాన్నే అంటిపెట్టుకొని ఉంటారు. అట్టివారికి ఆధ్యాత్మికం, ఆధిదైవికం, ఆధిభౌతికం అనే తాపాలు మూడూ అణగి పోతాయి. అప్పుడు వారి హృదయాలలో పరమతత్త్వం ప్రసన్నంగా ఉంటుంది. అది అన్ని విధాలైన సుఖాలనూ కలిగిస్తుంది. ఆ వాసుదేవుడు అన్నీ తానే అయినవాడు, కానివాడు కూడా. అట్టి పరమాత్మను తెలుసుకోవాలంటే భాగవతాన్ని తెలుసుకోవాలి.
1-37 వేదకల్పవృక్ష... (ఆటవెలది).
iBAA పద్య గానం
iBAP పద్యము
వేదకల్పవృక్షవిగళితమై శుక
ముఖసుధాద్రవమున మొనసి యున్న
భాగవతపురాణఫలరసాస్వాదన
పదవిఁ గనుఁడు రసికభావవిదులు.

iBAT సందర్భం

భాగవతరసాన్ని ఆస్వాదించటం ఎంతటి మహాఫలితాన్ని ఇస్తుందో పోతన్నగారు చక్కని అలంకారభాషలో మనకు బోధిస్తున్నారు.

iBAT తాత్పర్యము

రసికులైన తత్త్వమెరిగిన నరులారా! ఈ భాగవతం అనే పురాణపు ఫలంనుండి జాలు వారే రసాన్ని ఆస్వాదించే పదవిని పొందండి. ఈ పండు వేదాలనే కల్పవృక్షమునందే పండి క్రిందికి జారివచ్చింది. చిలుకవంటి శుకమహర్షి ముఖమందుండే అమృతద్రవాన్ని అంటించుకొని మరింతగా మాధుర్యాన్ని సంతరించుకొన్నది. నేలకు దిగివచ్చి మనకందరకూ అందుబాటులో కదలాడుతున్నది. రసికత ఉన్నవారైతే దీనిని కర్ణపుటాలతో జుఱ్ఱు కోండి. మీ జన్మ ధన్యమవుతుంది.

సప్తమ అధ్యాయం

1-137 ధీరులు నిరపేక్షులు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ధీరులు నిరపేక్షులు నా
త్మారాములు నైన మునులు హరిభజనము ని
ష్కారణమ చేయుచుందురు
నారాయణుఁ డట్టి వాఁడు నవ్యచరిత్రా!

iBAT సందర్భం

నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహర్షులకు పురాణాలు చెప్పటంలో గొప్ప ప్రజ్ఞగల సూతుడు, భాగవతాన్ని వ్యాసమహర్షి రచించి తన కుమారుడైన శుకయోగీంద్రుని చేత చదివించాడు- అని చెప్పగా శౌనకుడు, “అయ్యా శుకునకు మోక్షం తప్ప మరేమీ అక్కరలేదే. అతడు దేనినీ పట్టించుకోడే. అట్టివాడు భాగవతాన్ని ఎందుకు అభ్యసించాడు” అని అడిగాడు. అప్పుడు సూతుడు ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

మహర్షీ! నీ నడవడి కొనియాడదగినదయ్యా! విను. నీప్రశ్నకు బదులు చెబుతాను. గొప్పబుద్ధితో విలాసంగా విహరించేవారూ, ఏ అపేక్షతో అంటుసొంటులు లేనివారూ, ఆత్మతత్త్వమునందే ఆనందంపొందే శీలం కలవారూ అయిన మునులు శ్రీమహావిష్ణువు భజనను ఏ కారణమూ లేకుండానే చేస్తూ ఉంటారయ్యా! ఆ నారాయణుడు అటువంటి వాడు! ఏ కోరికా లేనివారికి కూడా అతనిని పూజించాలనే కోరిక కలుగుతూ ఉంటుంది.
1-139 నిగమములు వేయుఁ జదివిన... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నిగమములు వేయు చదివిన
సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్
సుగమంబు భాగవతమను
నిగమంబు పఠింప ముక్తినివసనము బుధా.

iBAT సందర్భం

శౌనకమహర్షికి శ్రీమహావిష్ణువును గూర్చి తెలియజెప్పే భాగవతం ఇంకా ఎంత గొప్పదో సూతుడు వివరిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

మహర్షీ! ఈ సృష్టిలో వాక్కుల స్వరూపాలెన్నో ఉన్నాయి. ఆ అన్నింటిలో చాలా ఉన్నత మైనతావులో ఉన్నవి వేదాలు. అవి పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని భద్రంగా పట్టి ఇస్తాయి. కానీ ముక్తి అందచందాలను అందించటంలో అవి యోగ్యమైనవిగా కనపడటం లేదు. ఎందుకంటే అవి వేలకొలదిగా చదివినా సుఖంగా తెలియరావు. కానీ భాగవతం అనే వేదాన్ని శ్రద్ధతో చదివితే ముక్తి గుట్టుమట్టులన్నీ సులభంగా అందుకోవచ్చు.

అశ్వత్థామను అవమానించుట

1-161 ఉద్రేకంబున రారు... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కిం
చిద్ద్రోహంబును నీకుఁ జేయరు బలోత్సేకంబుతోఁ జీఁకటిన్
భద్రాకారులఁ బిన్నపాఁపల రణప్రౌఢక్రియా హీనులన్
నిద్రాసక్తుల సంహరింప నకటా! నీ చేతు లెట్లాడెనో?

iBAT సందర్భం

అశ్వత్థామ కసాయివానికంటె ఘోరంగా నిద్రిస్తూ ఉన్న పాండవకుమారులను, మరి కొందరినీ నరికిప్రోవులు పెట్టాడు. ద్రౌపది ఆకడుపుకోతను తట్టుకోలేక కుమిలికుమిలి ఏడ్చింది. అర్జునుడు ఆమెను ఓదార్చి అశ్వత్థామను వధించటానికి కృష్ణునితోపాటు వెళ్ళాడు. అతడు దొరికాడు. కానీ గురుపుత్రుడని చంపక, కట్టితెచ్చి ద్రౌపదిముందు నిలిపాడు. అప్పుడా తల్లి ఇలా అన్నది.

iBAT తాత్పర్యము

అయ్యా! గురుపుత్రా! నాపసిబిడ్డలు నీమీదకు ఉద్రేకంతో నిన్నేదో చేసివేయాలని రాలేదే! ఆయుధాలు పట్టుకొని రణరంగంలో వీరవిహారం చేయలేదే! పైగా కండబలమూ, గుండెబలమూ పురికొల్పగా నీకు పిసరంత కూడా అపకారం చేసినవారు కారు గదా! చీకటిలో ఆదమరచి నిద్రిస్తున్నవారిని, యుద్ధంలో దుడుకు పనులుచేయటం చేతకానివారిని, చంపటానికి, అయ్యయ్యో! నీకు చేతులెలా ఆడాయి?

పరీక్షితుని రక్షించుట

1-179 చెల్లెలికోడల... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
చెల్లెలి కోడల నీమే
నల్లుఁడు శత్రువులచేత హతుఁడయ్యెను సం
ఫుల్లారవిందలోచన!
భల్లాగ్ని నణంచి శిశువు బ్రతికింపఁగదే.

iBAT సందర్భం

పాండవులు సేసిన పరాభవానికి కుమిలిపోయిన అశ్వత్థామ వెనుకా ముందూ చూడకుండా పాండవ గర్భాలను మాడ్చివేసే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది అభిమన్యుని యిల్లాలు ఉత్తర గర్భంలో ఉన్న శిశువును కాల్చివేయబోతున్నది. అప్పుడు ఉత్తర మరొక దారి లేక శ్రీకృష్ణుణ్ణి ఇలా ప్రార్థించింది.

iBAT తాత్పర్యము

బాగా విప్పారిన పద్మాలవంటి కన్నులుగల కన్నయ్యా! నేను నీముద్దుల చెల్లెలి కోడలిని. నీకు ఎంతో ప్రియుడైన నీమేనల్లుడు పగవారికి చిక్కిప్రాణాలు కోల్పోయాడు. ఇదిగో అశ్వత్థామ వేసిన బాణం నా గర్భాన్ని కాల్చివేస్తున్నది. దానిని అణగగొట్టి కడుపులో ఉన్న నిసుగును బ్రతికించు మహాత్మా!
1-182 తనసేవ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
తనసేవారతిచింత గాని పరచింతాలేశమున్ లేని స
జ్జనులం బాండుతనూజులన్ మనుపు వాత్సల్యంబుతో ద్రోణనం
దను బ్రహ్మాస్త్రము నడ్డపెట్ట బనిచెన్ దైత్యారి సర్వారి సా
దననిర్వక్రము రక్షితానఖిల సుధాంధశ్చక్రముం జక్రమున్.

iBAT సందర్భం

ఉత్తర ఆర్తనాదం శ్రీకృష్ణుని దయాంతరంగాన్ని కదిలించివేసింది. వెంటనే అతడు క్షణమైనా ఆలస్యం చేయకుండా ఉత్తర కడుపును కాపాడటానికి పూనుకొన్నాడు

iBAT తాత్పర్యము

ఆ పాండురాజు కొడుకులకు ఎల్లవేళలా తనను సేవించుకోవటమనే భావనయే కానీ మరొక చింత రవంత కూడా లేదు. అట్టివారిని ఆదుకోవాలి అనే వాత్సల్యభావంతో రక్కసులను చీల్చిచెండాడేవాడైన శ్రీకృష్ణుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవలసినదిగా చక్రాన్ని ఆదేశించాడు. అది సుదర్శనమనే నామం గలది. పగవారినందరినీ రూపుమాపటంలో గురితప్పనిది. అమృతమే అన్నమైన దేవతల సమాజాన్నంతటినీ కంటికిరెప్పలా కాపాడేది. అట్టి ఆ చక్రం తల్లి కడుపులో ఉన్న చిన్నినిసుగును కాపాడకుండా ఎలా ఉంటుంది?

కుంతిస్తుతి

1-183 సకల ప్రాణి హృదంతరాళముల... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
సకలప్రాణి హృదంతరాళముల భాస్వజ్జ్యోతి యై యుండు సూ
క్ష్మకళుం డచ్యుతు డయ్యెడన్ విరటజా గర్భంబు తా చక్రహ
స్తకుడై వైష్ణవమాయ గప్పి కురుసంతానార్థియై యడ్డమై
ప్రకటస్ఫూర్తి నణంచె ద్రోణతనయబ్రహ్మ్రస్త్రమున్ లీలతోన్.

iBAT సందర్భం

శ్రీకృష్ణపరమాత్మ ఉత్తర కడుపుననున్న చిన్నిబిడ్డను కాపాడిన తీరును పోతనమహాకవి అత్యద్భుతంగా వేదాంత రహస్యాలు పాఠకుల హృదయాలలో వింత వెలుగులను ప్రసరింపజేసే విధంగా వర్ణిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

ఆ పరమాత్మ ప్రాణంకల అందరి హృదయాలనే ఆలయాలలోపల దివ్య కాంతు లతో వెలుగొందే మహాదీపం. సూక్ష్మమైన కళతో అలరారేవాడు. ఎక్కడా ఏ విధమైన జారుపాటూ లేనివాడు. అట్టి జ్ఞానదీపమైన దేవుడు విరాటరాజ పుత్రిక అయిన ఉత్తరగర్భంలో ప్రవేశించాడు. చూడనలవికాని వెలుగులను చిందిస్తున్న చక్రాన్ని చేతితో పట్టుకున్నాడు. ఆయన అందరిలో అన్నింటిలో లోపలా వెలుపలా సంచరించే విష్ణువు కదా! అట్టి వైష్ణవ మాయతో కప్పివైచి కౌరవవంశానికి అంకురమైన బిడ్డను కాపాడటానికై, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని విలాసంగా అణచివేశాడు
1-191 కోపముతోడ... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
కోపముతోడ నీవు దధికుంభము భిన్నము సేయుచున్నచో
గోపికఁ ద్రాటఁ గట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధా
రాపరిపూర్ణ వక్త్రముఁ గరంబులఁ బ్రాముచు వెచ్చనూర్చుచుం
బాపఁడవై నటించుట కృపాపర! నామదిఁ జోద్య మయ్యెడిన్

iBAT సందర్భం

కుంతీదేవి కన్నయ్య చిన్ననాటి లీలలను తలచుకొని తలచుకొని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి ఇలా అంటున్నది.

iBAT తాత్పర్యము

కన్నయ్యా! ! నీవు అడిగిన వెంటనే అమ్మ నీవడిగినది ఇవ్వలేదని అలుకచెంది పెరుగుకుండను పగులకొట్టావు. ఆమె తెచ్చిపెట్టుకొన్న కోపంతో నిన్నొక త్రాటితో కట్టివేసి ఓరగా నిన్ను చూస్తూ ఉన్నది. అప్పుడు నీవు కళ్ళు చికిలించుకొని కాటుకతో నిండిన కన్నీళ్ళు ధారలై జాలువారుతున్న మోమును చేతులతో పాముకుంటూ వేడిగా నిట్టూర్పులు పుచ్చుతూ బాలుడవై నటించటం, కృపాకరా! నా మనస్సులో ఎంతో అబ్బురంగా భాసిస్తున్నది.
1-198 యాదవు... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
యాదవు లందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి
చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా!

iBAT సందర్భం

కుంతీదేవి గొప్ప జ్ఞానజ్యోతి గుండెలో దాచుకొన్న మహావ్యక్తి. పరమాత్మ అనుగ్రహాన్ని అందుకొనే మహాభాగ్యం కలవారు స్వామిని ఏమి కోరాలో మనకు తన మాటల ద్వారా తెలియజేస్తున్నది. ఆమె మానవసమాజానికి గొప్పగురువు.

iBAT తాత్పర్యము

సర్వకాలాలలో సర్వలోకాలనూ పాలించే ఓ ఈశ్వరా! నాకు నా పుట్టింటివారైన యాదవులందూ, మెట్టినింటివారైన పాండవులయందూ మోహం ఆవంత కూడా లేకుండా చేయి నాయనా! నీవు అన్ని లోకాలకూ పాలకుడవు. నా బుద్ధి సర్వకాల సర్వావస్థలలోనూ సముద్రంలోనికే చేరుకొనే గంగలాగా, నీ పాదపద్మాలను మాత్రమే మిక్కిలి ఎక్కువ ఆదరంతో కలిసిపోయే విధంగా దయచూడు, స్వామీ.
1-199 శ్రీకృష్ణా యదుభూషణా... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగార రత్నాకరా!
లోకద్రోహినరేంద్రవంశ దహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణ గోగణార్తి హరణా! నిర్వాణ సంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

iBAT సందర్భం

శ్రీకృష్ణవాసుదేవుడు ఉత్తరగర్భంలో ఉన్న కురువంశాకురాన్ని పరిరక్షించి తన నివాసానికి బయలుదేరాడు. ఆ సందర్భంలో శ్రీకృష్ణతత్వం చక్కగా తెలిసికొన్న కుంతీదేవి ఆ గోపాలబాలకుని ఇలా స్తుతించింది.

iBAT తాత్పర్యము

శ్రీకృష్ణా! నీవు యదువు, శూరుడు, వసుదేవుడు మొదలైన మహానుభావుల వంశానికి గొప్ప అలంకారం అయినవాడవు, నరుడైన అర్జునుడు నీకు ప్రాణమిత్రుడు. సౌందర్యం ఒక రత్నాలగనియైన సముద్రమైతే ఆ రత్నాకరుడవు నీవే. లోకాలకు కీడుచేసే రాజవంశాలను కాల్చి బూడిదచేసిన దయామయుడవు నీవు. పదునాలుగు లోకాలకూ ప్రభుడవు. దేవతల గుంపులకు, బ్రహ్మజ్ఞాన సంపన్నులకూ, గోవులకూ కలిగే ఆర్తిని హరించివేస్తావు. నీవు భక్తులైనవారికి పరమసుఖాన్ని చక్కగా ప్రసాదిస్తావు. నిత్యమైన దయకు నిధివైన ఓ స్వామీ! నాతండ్రీ!. సంసారంలో కట్టిపడవేసే బంధాలనే తీగలను త్రెంచివేయవయ్యా! నీకు మ్రొక్కుతాను.

భీష్మునికడకేగుట

1-212 రాజట ధర్మజుండు... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
రాజఁట ధర్మజుండు, సురరాజ సుతుండట ధన్వి, శాత్రవో
ద్వేజకమైన గాండివము విల్లఁట, సారథి సర్వభద్ర సం
యోజకుఁడైన చక్రి యఁట, యుగ్ర గదాధరుఁడైన భీముఁ డ
య్యాజికిఁ దోడు వచ్చునఁట, యాపద గల్గుట యేమి చోద్యమో!

iBAT తాత్పర్యము

అంపశయ్యపై వెలుగొందుతూ అవసానకాలాన్ని ఎదురు చూస్తున్న భీష్ముణ్ణి దర్శించుకోవటానికి ధర్మరాజు తమ్ములతో బంధువులతో సర్వలోకబాంధవుడైన వాసుదేవునితో కలసి వెళ్ళాడు. ఆ సమయంలో పాండవులు పడ్డ కష్టాలను, వారి భాగ్యసంపదను సంభావిస్తూ భీష్ముడు ఇలా అన్నాడు.

iBAT సందర్భం

ధర్మదేవత కుమారుడు ధర్మరాజు రాజట. దేవేంద్రుని కుమారుడు అర్జునుడు గొప్ప విలుకాడట. పగవారి గుండెలలో గుబులు పుట్టించే గాండీవం ఆ అర్జునుడు ఉప యోగించే విల్లట. సర్వజనులకూ, సర్వవిధాలైన శుభాలను సమకూర్చే చక్రధారి కృష్ణుడు ఆ గాండీవికి సారథిగా ఉన్నాడట. పరమ భయంకరమైన గదను చేతబట్టిన భీమసేనుడు ఆ పోరులో తోడుగా ఉన్నాడట. ఇంత సాధన సంపత్తి ఉన్నా, నాయనలారా! మీకు ఆపద కల్గినదట! ఇది యెంత అబ్బురమైన విషయం!
1-217 ఆలాపంబులు మాని... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముం జేసి దృ
గ్జాలంబున్ హరిమోముపైఁ బఱపి తత్కారుణ్య దృష్టిన్ విని
ర్మూలీభూత శరవ్యధా నిచయుఁడై మోదించి భీష్ముండు సం
శీలం బొప్ప నుతించెఁ గల్మషగజశ్రేణీ హరిన్ శ్రీహరిన్.

iBAT సందర్భం

తాత భీష్ముడు తాను కోరినప్పుడు మరణం పొందేవరం తండ్రివలన పొందిన వాడు. తనకు మిక్కిలి ఆప్తులైన ఉత్తమ పురుషులు పాండవులు, పురుషోత్తముడైన వాసుదేవుడూ తన్ను సేవిస్తూ తన దగ్గర ఉన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. చేయవలసిన పని ఏమీలేదు. దేహాన్ని వదలివేయాలని నిశ్చయించుకొన్నాడు.

iBAT తాత్పర్యము

అనవసరమైన మాటలను మానివేశాడు. మనస్సును బుద్ధికి అధీనంలో ఉండే విధంగా కూర్చుకొన్నాడు. చూపులన్నింటినీ శ్రీకృష్ణుని మోము మీదనే నిలిపి ఉంచాడు. ఆ మహాత్ముడు వాసుదేవుని దయతో నిండిన చూపులవలన యుద్ధమాడినపుడు ఒడలిలో గ్రుచ్చుకొన్న బాణపు ములుకులు పెడుతున్న బాధలన్నీ మూలముట్టుగా తొలగిపోయాయి. ఆనందం తనలో తాండవిస్తూ ఉన్నది. మిక్కిలి ఉత్తమమైన శీలం ప్రకాశిస్తూ ఉన్నది. అలా అన్నింటినీ చక్క చేసుకొని పాపాలనే ఏనుగుపంక్తులను రూపుమాపే శ్రీహరిని స్తుతించాడు.

భీష్మస్తుతి

1-219 త్రిజగన్మోహన నీలకాంతిఁ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.

iBAT సందర్భం

అంపశయ్యమీద హాయిగా మేను వాల్చి శ్రీకృష్ణ పరమాత్మను హృదయ దేవాలయంలో భద్రంగా నిలుపుకొని ఆనందసామ్రాజ్యంలో విహరిస్తున్నాడు శంతనుని కుమారుడు భీష్ముడు. అప్రయత్నంగా తనకు ఆత్మీయులైన పాండవులతో కలసి తాను ఉన్న చోటుకే వచ్చి నిలుచున్నాడు వాసుదేవుడు. ఆ పరమాత్ముని నోరారా కొనియాడుతున్నాడు భీష్ముడు.

iBAT తాత్పర్యము

మూడులోకాలు మురిసిపోయే నీలవర్ణంలో అలరారే దేహం పైపైకి కాంతులను విరజిమ్ముతూ ఉన్నది. ఉదయకాలంలో సూర్యభగవానుని వంటి ఉత్తరీయం ఆ నల్లని దేహం మీద రంజిల్లుతున్నది. నిగనిగలాడే నల్లని ముంగురుల మొత్తాలు మోము అనే పద్మంమీద క్రమ్ముకొని దోబూచులాడుతున్నాయి. ఎంతసేపు చూచినా ఆ మొగం సొబగు ఇకచాలు అనిపించటం లేదు కదా. ఆ విధమైన స్వరూపంతో మా ముద్దులమనుమడు అర్జునుని కడకు చేరుకొంటున్న వన్నెచిన్నెలస్వామి కన్నయ్య నా హృదయంలో ఎల్లప్పుడూ నెలకొని ఉండాలి.
1-220 హయరింఖాముఖ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
హయరింఖాముఖ ధూళి ధూసరపరిన్యస్తాలకోపేతమై
రయజాతశ్రమతోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో
జయమున్ పార్ధున కిచ్చువేడ్క నని నా శస్త్రాహతింజాల నొ
చ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్.

iBAT సందర్భం

ప‍రమ భాగవతోత్తముడు గంగమ్మ ముద్దులబిడ్డడు, జ్ఞానసంపన్నుడు ఇంకా శ్రీకృష్ణపరమాత్మను గురించి యిలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

ఆ కన్నయ్య మహానుభావుడు ఊహల కందని గొప్పతనం కలవాడు. ఎందుకంటే ఆయన సాక్షాత్తూ పరమాత్మ అని తెలిసి కూడా నేను యుద్ధధర్మాన్ని పాటించి ఆయన దేహాన్ని కుళ్ళబొడిచాను. అయినా ఆయన నన్ను చంపటమో, యుద్ధభూమినుండి రథికుడైన అర్జునుని తొలగించుకొని పోవటమో చేయక ఏది ఏమైనా అతనికి జయమునే కలిగించాలని గొప్ప ఉత్సాహంతో పోరు సాగించిన మహానుభావుడు. గుఱ్ఱాల డెక్కల కొనల తాకిడికి లేచిన దుమ్ముతో నిండిన ముంగురులు మొగంమీద చిందులు త్రొక్కుతున్నాయి. వడివడిగా గుఱ్ఱాలను తోలటం వలన మోము అంతా చెమట బిందువులతో ఒప్పులకుప్పగా ప్రకాశిస్తున్నది. పరమమనోహరమైన ఆ మొగంతో అలరారే ఆ స్వామిని అలుపూ సొలుపూ లేకుండా భావిస్తూనే ఉంటాను.
1-221 నరుమాటల్ విని... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
నరుమాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమక్షోణిలో
పరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచున్
పరభూపాయువులెల్ల చూపులన శుంభత్కేళి వంచించు నీ
పరమేశుండు మెలంగుచుండెడు మనఃపద్మాసనాసీనుడై.

iBAT సందర్భం

ఎప్పుడో కురుక్షేత్ర మహాసంగ్రామంలో తనముందు కదలాడిన చైతన్యమూర్తి శ్రీకృష్ణుడే అంపశయ్య మీద హాయిగా పవ్వళించిన భీష్ముని హృదయమందిరంలో మెరసి పోతున్నాడు. ఆ అనుభూతిని మాటలతో అందరికీ అమృతప్రసాదంలాగా అందిస్తున్నాడు భక్త శిఖామణి భీష్ముడు.

iBAT తాత్పర్యము

కౌరవులూ, పాండవులూ కురుక్షేత్రంలో పోరాటానికి తలపడి నిలిచి ఉన్నారు. హఠాత్తుగా పాండవపక్షంలోని పరమవీరుడు పార్థుడు ‘అచ్యుతా! నా రథాన్ని రెండు సేనల మధ్యలో నిలబెట్టు. నేనెవరితో పోరాడాలో ఒకసారి చూస్తాను’ - అన్నాడు. కన్నయ్యకు ఆ మాటలు విన్నంతనే నవ్వు వచ్చింది. పగవారు పట్టిపట్టి పరికిస్తూ ఉండగా రెండు సేనల మధ్యలో ఉన్న నేలమీద రథాన్ని నిలబెట్టాడు పార్ధసారధి. శత్రువులైన రాజులనందరినీ చూపిస్తున్నాడు. ఆ చూపులతోనే పరరాజుల ఆయువులన్నింటినీ విలాసమైన ఒక ఆటగా లాగివేసుకుంటున్నాడు. అట్టి పరమాత్మ నా మనస్సు అనే పద్మంలో సుఖంగా నెలకొని మెలగుతూ ఉండాలి.
1-222 తనవారి చంపజాలక... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
తనవారి చంపజాలక
వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్
ఘన యోగవిద్యఁ బాపిన
మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్.

iBAT సందర్భం

పరమభాగవతశిఖామణి భీష్ముడు శ్రీకృష్ణవాసుదేవుని జ్ఞానకిరణాల ప్రసారాన్ని గురించి యిలా తన హృదయంలో ముచ్చటించుకుంటున్నాడు.

iBAT తాత్పర్యము

అతని పేరు విజయుడు. అది ఆషామాషీగా రాలేదు. అనేక యుద్ధాలలో సాధించిన గెలుపులకు సంకేతంగా వచ్చింది. అటువంటి మహావీరుడు అర్జునుడు తప్పనిసరిగా గెలువవలసిన కురుక్షేత్ర మహాసంగ్రామం దగ్గరకు వచ్చేసరికి నీరుకారిపోయాడు. చంపవలసిన వారందరూ తనవారే. ఎలా చంపటం?! ఇదీ అతని శంక. ఈ శంక కూడా ఆషామాషీగా పోయేది కాదని సర్వజ్ఞుడైన వాసుదేవునికి తెలుసు. అందుకని ఘనమైన యోగ విద్యను ఉపదేశింపవలసి వచ్చింది. అదే యోగశాస్త్రమైన భగవద్గీత. అది వాసుదేవుని జ్ఞానాస్త్రం. దానితో అర్జునుని శంక నామరూపాలు లేకుండా పోయింది. గీతోపదేశం చేసిన జ్ఞానమూర్తి కనుకనే ఆయన మునులందరికీ వంద్యుడైనాడు. ఆ మహాత్ముని పాదాలమీది భక్తి నాకు అనుక్షణమూ గుండెగుడిలో ఘంటల మోతలాగా మ్రోగుతూ ఉండాలి.
1-221 కుప్పించి యెగసినఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పిగొనగ
ఉఱికిన నోర్వక ఉదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదల
చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార
నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మఱల దిగువ

(తేటగీతి)

కరికి లంఘించు సింహంబు కరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువు మర్జున! అనుచు మద్విశిఖ వృష్టి
తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు.

iBAT సందర్భం

పోరు అతిక్రూరంగా జరుగుతున్నది. పరశురామునంతటి వానిని కదలించి కుదిలించి వైచిన భీష్ముడు ప్రళయకాలంలో రుద్రునిలాగా పాండవసేనను చీల్చి చెండాడుతున్నాడు. పరమశివుని బాణవిద్యలో మెప్పించిన అర్జునుడు తల్లడిల్లిపోతున్నాడు. తన ప్రతిజ్ఞను కూడా ప్రక్కనపెట్టి భక్త రక్షణకళలో పేరుపొందిన కృష్ణుడు భీష్ముణ్ణి చంపి అర్జునుని కాపాడటానికి సంసిద్ధుడైనాడు. అప్పటి శ్రీకృష్ణుని సంరంభాన్ని ఇప్పటిదాకా హృదయంలో పదిలంగా నిలుపుకొన్న భీష్ముడు దానిని కమనీయ వాక్కుల ద్వారా సంభావిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

శ్రీకృష్ణుడు రథంలో సారధిస్థానం నుండి ఒక్క పెట్టున కుప్పించి పైకి లేచాడు. ఆ ఊపులో అతని కుండలాల కాంతి గగనాన్నంతా క్రమ్మివేసింది. అదే వేగంతో క్రిందికి దూకాడు. బొజ్జలో ఉన్న లోకాల బరువునకు వెలుపలి జగత్తు కంపించిపోయింది. తల నరకటానికి చక్రాన్ని చేతిలో అమర్చుకొని తనపైకి వస్తున్నాడు. ఆ వడికి ఉత్తరీయంగా వేసుకొన్న పచ్చని పట్టుబట్ట జారిపోతున్నది. ‘స్వామీ! నిన్నేనమ్ముకొన్నాను. నా బలవిక్రమాలను నవ్వులపాలు చేయబోకు. నా పరువు కాపాడు’ అని ఇంద్రుడు మెచ్చి బహూకరించిన కిరీటం తలమీద మిలమిలలాడుతున్న అర్జునుడు వెనుకకు త్రిప్పటానికి బలమంతా ఉపయోగించి లాగుతున్నాడు. అయినా ఏనుగుమీదికి దూకే సింహంలాగా మెరసిపోతూ ‘ఉండు, అర్జునా! నన్ను వదలిపెట్టు. ఈనాడు భీష్ముణ్ణి చంపుతాను. నిన్ను కాపాడుతాను’ అంటూ నా బాణాల జడివానను తప్పించుకుంటూ నా మీదికి వస్తూ ఉన్నాడు. ఆ విధంగా వచ్చి, నన్ను చంపాలని నేను కోరుకుంటున్న ఆ స్వామియే నాకు దిక్కు.
1-224 తనకున్ భృత్యుఁడు... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
తనకున్ భృత్యుఁడు వీనిఁ గాఁచుట మహాధర్మంబు వొమ్మంచు న
ర్జునసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్
మునికోలన్వడిఁ జూపి ఘోటకములన్మోదించి తాడించుచున్
జనులన్మోహము నొందఁజేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్.

iBAT సందర్భం

స్వామి భక్తులను సంరక్షించే కళలో గొప్ప ఉత్సాహం కలవాడు. కనుక ఆ ప్రయోజనం కోసం తన స్థాయికి తగని ఏ పనికైనా, సిద్ధపడతాడు. అందుకే అర్జునుని రథంలో కూర్చుని గుఱ్ఱాలను తోలడానికి పూనుకున్నాడు. అంటే మహాభక్తితో భక్తుల సేవలందుకొనే స్వామి సేవకుడయ్యాడు. దానిని భీష్ముడు ఇలా భావిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

ఈ అర్జునుడు నాకు, తల్లికి కొడుకులాగా కంటికి రెప్పలాగా, కాపాడవలసిన వాడు. వీనిని కాపాడటం మహాధర్మం అని అతని రథాన్ని నడపటానికి పూనుకొన్నాడు కృష్ణుడు. సారథులను ఎందరినో చూచాను. కానీ ఈయన పగ్గాలు పట్టుకొన్న తీరుతెన్నులు ఎంత అద్భుతంగా ఉన్నాయి. అలా ఒక చేతిలో పగ్గాలూ, మరొక చేతిలో చెర్నాకోల. దానితో పొగరు గుఱ్ఱాలను ప్రమోదంతో చిన్ని చిన్ని దెబ్బలు తగిలిస్తూ – అబ్బే తగిలిస్తున్నట్లు కనిపిస్తూ- యుద్ధరంగంలోని జనులను మోహపెడుతూ ఉండే పరమోత్సాహంగల స్వామిని తనివితీరా కొనియాడుతాను.
1-227 ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఒక సూర్యుండు సమస్త జీవులకు తా నొక్కొక్కడై తోచు పో
లిక నే దేవుడు సర్వకాలము మాహాలీలన్ నిజోత్పన్న జ
న్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుడై యొప్పుచునుండు నట్టి హరి నే ప్రార్థింతు శుద్ధుండనై.

iBAT సందర్భం

ఆయన మన కళ్ళముందు అందరిలాగా తిరుగుతూ మామూలు మనిషే అనిపి స్తాడు. కానీ జ్ఞానసంపన్నుడు భీష్ముని చూపునకు ఆయన పరమాత్మయే. ఆ పరమరహస్యాన్ని ఎంత పరమసుందరంగా తెలియజేస్తున్నాడో ఆచార్య భీష్ములు గమనిద్దాం.

iBAT తాత్పర్యము

ప్రతి దినం మనం ఆకాశంలో ఈ అంచున ఉదయించి ఆ అంచున అస్తమించే అంబరమణి సూర్యభగవానుని చూస్తూనే ఉంటాం. నిజానికి ఆయన ఒక్కడే. కానీ చూచే ప్రతివ్యక్తీ నా సూర్యుడు, నా వాడే సూర్యుడు అనుకొనేట్లుగా కనపడుతూ ఉంటాడు. అలాగే ఇప్పుడు కృష్ణభగవానుని రూపంతో కానవస్తున్న ఈ దేవుడు అనంతమైన లీలతో తననుండి పుట్టిన ప్రాణుల గుంపుల హృదయాలనే పద్మాలలో నానావిధాలైన గొప్పగొప్ప రూపాలతో కానవస్తూ ఉంటాడు. అట్టి పరమాత్ముణ్ణి, మనస్సులో, మాటలో, చేష్టలో సహజంగా ఏర్పడే మాలిన్యాన్ని పిసరంతకూడా మిగులకుండా తొలగించుకొని ప్రార్థిస్తూ ఉంటాను.

దశమ అధ్యాయం

1-247 నీ పాదాబ్జము... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
నీపాదాబ్జము బ్రహ్మపూజ్యము గదా! నీ సేవ సంసార సం
తాపధ్వంసిని యౌఁ గదా! సకలభద్రశ్రేణులం బ్రీతితో
నాపాదింతు గదా! ప్రపన్నులకుఁ గాలాధీశ! కాలంబు ని
ర్వ్యాపారంబు గదయ్య! చాలరు గదా! వర్ణింప బ్రహ్మాదులున్.

iBAT సందర్భం

కురుకులపితామహుడు భీష్ముడు మానుషదేహాన్ని వదలివైచి తన స్థానానికి వెళ్ళి పోయాడు. ధర్మరాజు అతనికి శాస్త్రం చెప్పిన విధంగ పరలోకక్రియలు భక్తిశ్రద్ధలతో ఆచరించాడు. తరువాత ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. జగన్నాయకుడు శ్రీ కృష్ణుడు తిరిగి తన నివాసం అయిన ద్వారకకు చేరుకొన్నాడు. అక్కడి ప్రజలు ఆనందంతో అతనిని ఇలా పూజిస్తున్నారు.

iBAT తాత్పర్యము

కృష్ణా! వాసుదేవా! ఈ పదునాలుగు లోకాలనూ సృష్టించే బ్రహ్మదేవునకు నీ అడుగుదామర పూజింపదగినది కదా! నిన్ను సేవిస్తే సంసార బంధమైన తాపమంతా రూపుమాసిపోతుంది. నీవే తప్ప మరొక దిక్కులేదు అని నిన్ను చేరుకొన్నవారికి సమస్త కల్యాణ పరంపరలను ప్రీతితో నీవు కూరుస్తావు. నీవు కాలానికి కూడా ప్రభుండవు. నీవు సంకల్పిస్తే కాలం కదలకుండా మెదలకుండా నిలిచిపోతుంది. నీ గుణగణాలను వర్ణించటానికి నాలుగు నోళ్ళున్న బ్రహ్మదేవుడు, వేయి నోళ్ళున్న ఆదిశేషుడు మొదలైనవారు కూడా శక్తిలేనివారే అవుతారు.
1-256 జలజాతాక్షుడు సూడ... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
జలజాతాక్షుడు చూడ నొప్పె ధవళచ్ఛత్రంబుతో, చామరం
బులతో, పుష్పపిశంగచేలములతో, భూషామణిస్ఫీతుడై
నలినీబాంధవుతో, శశిద్వయముతో, నక్షత్ర సంఘంబుతో
బలభిచ్చాపముతో తటిల్లతికతో భాసిల్లు మేఘాకృతిన్.

iBAT సందర్భం

శ్రీకృష్ణచంద్రుడు ద్వారకలో రాజమార్గంలో విలాసంగా సంచరిస్తూ కానవస్తున్నాడు. ఆదివ్యసుందర మూర్తిని పురకాంతలు చూస్తూ పులకలెత్తిన దేహాలతో పొంగిపోతున్నారు. అప్పుడప్పుడే విరిసిన పూవులను కృష్ణునిపై వర్షిస్తున్నారు. అప్పటి కన్నయ్య ఉన్న తీరు ఎంత మనోజ్ఞంగా ఉన్నదో!

iBAT తాత్పర్యము

నల్లనివాడు, పద్మనయనంబులవాడు అయిన శ్రీకృష్ణుడు ద్వారకలో ఊరేగింపుగా మెలమెల్లగా అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ కదలుతున్నాడు. పైన తెల్లని గొడుగు. అటు ఇటూ వింజామరలు. పూవులుకుట్టిన పచ్చనికాంతితో కనులపండుగ చేస్తున్న కమనీయ వస్త్రాలు. నిలువెల్లా పెక్కుతీరులైన బంగారంలో పొదిగిన వజ్రాలు వైడూర్యాలు మొదలైనవి కల నగలు. ఆహా! ఎంత మనోహరరూపం. ఆయనను చూచి పైకి అలా భావనతో చూస్తే ఒక నల్లని మేఘం. ఇక్కడి గొడుగు ఆ మేఘం మీద వెలుగుల కుప్పలతో కప్పుచున్న సూర్యుణ్ణి తలపింపజేస్తున్నది. చామరాలు రెండు చందమామలలా ఉన్నాయి. నగలు నక్షత్రాలలాగా మెరిసిపోతున్నాయి. ఆభరణాలు ఇంద్రధనుస్సులాగా విరాజిల్లుతున్నాయి. మణులు మెరుపుతీగలను స్ఫురింపజేస్తున్నాయి.

శ్రీకృష్ణ నిర్యాణం

1-348 అన్నా ఫల్గున... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
అన్నా! ఫల్గున! భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడా
పన్నానీక శరణ్యు డీశుడు జగద్భద్రానుసంధాయి శ్రీ
మన్నవ్యాంబుజపత్రనేత్రుడు సుధర్మామధ్య పీఠంబునం
దున్నాడా? బలభద్రు గూడి సుఖియై యుత్సాహియై ద్వారకన్.

iBAT సందర్భం

శ్రీకృష్ణస్వామి అవతారప్రయోజనం ముగించుకొని తన వైకుంఠానికి వెళ్ళిపోయా డు. అర్జునుడు బరువెక్కిన హృదయంతో ద్వారకకు వెళ్ళి చేయవలసిన పనులన్నీ చేసి తిరిగి హస్తినాపురానికి వచ్చాడు. కళాకాంతులులేని ఆతని మోమును చూచి కంగారుపడి ద్వారక లోని వార్తలడుగుతూ ధర్మరాజు ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

నాన్నా! అర్జునా! మన సారథి మన సచివుడు ఇంకా ఎన్నెన్నో అయిన కృష్ణయ్య, భక్తులయందు పరమవాత్సల్యం కలవాడు. బ్రహ్మజ్ఞానమే ఆకారం అయినవాడు, గోవులకు ఆనందం కలిగించేవాడు, ఆపదలలో వేదనలు పొందే భక్తుల సముదాయాలకు సంరక్షణ కూర్చేవాడు, ప్రభువు, జగత్తులకు శుభాలను అమర్చిపెట్టేవాడు, చక్కని కాంతులతో అప్పుడప్పుడే వికసించిన తామరరేకులవంటి కన్నులున్న మహాత్ముడు, దేవలోకంలో సుధర్మ అనే దేవసభలో కొలువుతీరి ఉన్న దేవేంద్రునిలాగా ద్వారకలో తన కొలువులో సింహాసనం మీద అన్న బలరామునితో కూడి సుఖంగా, ఉత్సాహంగా ఉన్నాడా?
1-350 మున్నుగ్రాటవిలో... (శార్దూలం).
iBAA పద్య గానం
iBAP పద్యము
మున్నుగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితో పోరుచో
సన్నాహంబున కాలకేయుల వడిం జక్కాడుచో ప్రాభవ
స్కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులం ద్రోలుచో
కన్నీరెన్నడు తేవు తండ్రి! చెపుమా! కల్యాణమే? చక్రికిన్.

iBAT సందర్భం

ద్వారకలో శ్రీకృష్ణవాసుదేవుడు తనువు చాలించి తన ధామానికి వెళ్ళిపోయాడు. ఆయన నిత్యానందమూర్తి. కానీ భక్తులు ఆయన అవతారం చాలించటం తట్టుకోలేరుకదా! అందునా అర్జునునివంటి నిత్యసన్నిహితుల గుండెలు కుతకుతలాడిపోతాయి కదా! అటువంటి అర్జునుని చూస్తున్న అన్న ధర్మరాజునకు గుండె బరువెక్కి పోయింది. . తమ్మునితో ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

నాయనా! అర్జునా! నీకు లోగడ మహాభయంకరమైన కష్టాలు ఎన్నో వచ్చాయి. అతిభయంకరమైన అడవిలో పందికోసం మూడుకన్నుల దేవుడు పరమేశ్వరునితో పోరాడావు. కాలకేయులనే క్రూరరాక్షసులను ఒక్కడవై తుక్కుదూగరగా కొట్టావు. గుండె దిటవు చెడగొట్టుకొని గంధర్వులకు దొరకిపోయి కుమిలిపోతున్న కురుకుల సార్వభౌముడు దుర్యోధనుని కాపాడటానికి గంధర్వులను తరిమికొట్టావు. ఇంకా ఇటువంటి మహాసాహస కార్యాలు చేసిన ఏ సమయంలోనూ నీవు కన్నులలో నీరుపెట్టలేదు. చెప్పు, త్వరగా చెప్పు. బాబూ! చక్రంతో దుష్టులను తునిమితూటాడే మహాత్ముడు శ్రీకృష్ణుడు క్షేమమేనా?
1-358 మన సారథి, మన సచివుడు... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
మన సారథి, మన సచివుడు
మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్
మన విభుడు, గురువు, దేవర
మనలను దిగనాడి చనియె మనుజాధీశా!

iBAT సందర్భం

అన్న మాటలు వింటున్న అర్జునునకు ఉల్లం మరింత ఎక్కువగా తల్లడిల్లి పోతున్నది. మాట పెగలటంలేదు. ఎలాగో తెముల్చుకొని కన్నీళ్ళు తుడుచుకొని నిట్టూర్పులు నిగుడిస్తూ ఇలా అన్నాడు.

iBAT తాత్పర్యము

మహారాజా! మనందరినీ రణరంగంలోనూ , జీవితంలోనూ భద్రంగా నడిపించిన సారథి, మనకు అవసరమైన అన్నిసమయాలలోనూ సరియైన ఆలోచనలను ఉపదేశించిన మంత్రి, మన యింటికి పిల్లనిచ్చిన సంబంధి, మన ప్రాణాలకు ప్రాణమైన చెలికాడు, మన అమ్మకు మేనల్లుడైన దగ్గరి చుట్టము, మన ప్రభువు, మన గురువు, మన దేవుడు మనలను ఇక్కడనే వదలివేసి తన దారిని తాను వెళ్ళిపోయాడయ్యా!
1-360 ఇభజిద్వీర్య మఖాభిషిక్తమగు... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఇభజిద్వీర్య! మఖాభిషిక్తమగు నీ యిల్లాలి ధమ్మిల్లమున్
సభలో శాత్రవు లీడ్చినన్ ముడువ కా చంద్రాస్య దుఃఖింపగా
అభయం బిచ్చి ప్రతిజ్ఞ చేసి భవదీయారాతికాంతాశిరో
జ భరశ్రీలు హరింపడే విధవలై సౌభాగ్యముల్ వీడగన్.

iBAT సందర్భం

కృష్ణుడు తనకూ తనవారికీ చేసిన ఉపకారాలనూ, కంటికి రెప్పలా కాపాడిన సన్నివేశాలనూ తలచుకొని తలచుకొని, తక్కిన సోదరుల ముందర అన్నకు చెప్పుకొని కకావికలై పోతున్నాడు గాండీవి అయిన అర్జునుడు.

iBAT తాత్పర్యము

ఏనుగులను చీల్చిచెండాడే గొప్పశక్తిగల సింహంవంటి పరాక్రమంగల ధర్మరాజా! నీ ధర్మపత్ని ద్రౌపది రాజసూయమూ, అశ్వమేధమూ మొదలైన మహాయజ్ఞాలు చేసినప్పుడు నీతోపాటు అవభృథస్నానం చేసిన గొప్పపవిత్రమూర్తి. అట్టి ఆమె కొప్పును పట్టుకొని నీచులైన నీపగ వారు ఈడ్చుకొని వచ్చారు. దానితో పగపట్టిన నాగుపామువలె చంద్రునివంటి మోముగల ఆ యిల్లాలు కొప్పును ముడువక దుఃఖంతో ఎంతోకాలం అలాగే ఉన్నది. అట్టి ఆ ఉత్తమవనితకు అభయం ఇచ్చి ఆ పురుషోత్తముడు ఆ పరమనీచులను పరిమార్చి వారి ఇల్లాండ్రను విధవలనుగా చేస్తానని ప్రతిజ్ఞచేశాడు. ప్రతిన ననుసరించి నీ పగవారి పడతుల తలవెంట్రుకల సౌభాగ్యం అంతరించి పోయేవిధంగా వారిని విధవలను చేశాడు కదా!
1-361 వైరుల్ గట్టిన పుట్టముల్….
iBAA పద్య గానం
iBAP పద్యము
వైరుల్ గట్టిన పుట్టముల్ విడువగా వారింప నావల్లభుల్
రారీవేళ ఉపేక్షసేయ దగవే? రావే? నివారింపవే?
లేరే? త్రాతలు కృష్ణ! యంచు సభలో లీనాంగియై కుయ్యిడన్
కారుణ్యంబున భూరివస్త్రకలితంగా చేయడే; ద్రౌపదిన్.

iBAT సందర్భం

కృష్ణుడు తనవారియెడల చూపిన కారుణ్యాన్ని మళ్ళీమళ్ళీ సంభావిస్తూ అర్జునుడు అన్నతో ఇలా అంటున్నాడు ద్రౌపది నిండుసభలో పొందిన పరాభవాన్నీ, దానికి శ్రీకృష్ణుడు చేసిన ప్రతిక్రియనూ ఈ పద్యంలో స్మరిస్తున్నాడు ఆ మహాత్ముడు .

iBAT తాత్పర్యము

పగవారు పరమనీచులు. నీతిమాలినవారు. గొప్పకులంలో పుట్టి గొప్పవారిని చేపట్టిన పరమ పవిత్ర అయినపాంచాలిని నిండుసభలో బట్టలను ఊడదీయటానికి ప్రయత్నించారు. అన్నా! కృష్ణా! నా భర్తలు ఈ నీచమైన పనిని నిలువరించటానికి రాకున్నారు. నీవు కూడా ఉపేక్ష చేస్తే ఎలా! రావయ్యా! ఈ ఘోరకృత్యాన్ని ఆపవయ్యా! నన్ను రక్షింపగలవారు ఇంకెవరూ లేరు కదయ్యా! అంటూ సభలో మొరపెట్టుకున్న ద్రౌపదికి అంతటా అన్నిటా అన్ని కాలాలలో ఉండే స్వామి ఆమెకు పెద్దయెత్తున వస్త్రాలనిచ్చి కాపాడాడు కదయ్యా!
1-364 గురుభీష్మాదుల... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
గురుభీష్మాదుల గూడి పన్నిన కురుక్షోణీశ చక్రంబులో
గురుశక్తిన్ రథయన్తయై, నొగలపై కూర్చుండి, యా మేటి నా
శరముల్ వాఱకమున్న వారల బలోత్సాహాయురుద్యోగత
త్పరతల్ చూడ్కుల సంహరించె నమితోత్సాహంబు నాకిచ్చుచున్.

iBAT సందర్భం

అర్జునుడు శ్రీకృష్ణదేవుని కరుణను ఇంకా ఇలా తలచుకుంటూ అన్నకు విన్నవించుకుంటున్నాడు. తాను పార్థుడు. ఆయన పార్థసారథి. జగన్నాటక ప్రవర్తకుడు తనకు సారథి కావటం ఎంతటి మహాభాగ్యం!

iBAT తాత్పర్యము

మనకు ఎదిరిపక్షంలో ఉన్నవారు దేవతలకు కూడా అడలు పుట్టింపగల ద్రోణుడు, భీష్ముడు మొదలైనవారు. వారు గొప్పగొప్ప వ్యూహాలు పన్నుకొని పోరికి శూరులై నిలిచి ఉన్నారు. ఈ స్వామి నా రథానికి సారథి. చాలా గొప్పశక్తిని నింపుకొని బండి నొగలపై కూర్చుండినాడు. నేను నా శక్తినంతా ఉపయోగించి పగవారిమీద బాణాలు గుప్పిస్తూ ఉన్నాను. కానీ అవి ఆ పోటుమగలను చేరకముందే వారి బలాన్నీ ఉత్సాహాన్నీ ఆయువునూ, పూనికనూ, శ్రద్ధనూ చూపులతోనే రూపుమాపివేశాడు. ఆపనితో నాకు పిక్కటిల్లిన ఉత్సాహాన్ని పెంపొందించాడు.
1-371 అటమటమయ్యె... (చంపకమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
అటమటమయ్యె నాభజనమంతయు భూవర! నేడు చూడుమా!
యిటువలె గారవించు జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మటన్
పటుతర దేహలోభమున ప్రాణములున్నవి వెంటబోక నే
కటకట! పూర్వజన్మమున కర్మము లెట్టివి చేసినాడనో!

iBAT సందర్భం

శ్రీకృష్ణుని ఎడబాటును తట్టుకోలేకపోతున్నాడు మహాధీరుడైన పాండవ మధ్యముడు. ఇంద్రాదులను గూడా ధనుర్విద్యలో మెప్పించిన కిరీటి హృదయంలోని ఆరాటం అతనిని నిలువనీయటంలేదు. తన దుఃఖావేశాన్ని అన్నకు ఇలా తెలుపుకుంటున్నాడు.

iBAT తాత్పర్యము

ప్రభూ! చేసిన శ్రీకృష్ణభజనమంతా బూడిదలో పోసిన పన్నీరులాగా పనికిమాలినదయిపోయింది. చూడు. నన్నింతగా ప్రేమాదరాలతో లాలించిన జగన్నాథుడు, శ్రీకృష్ణుడు లేని తరువాత కూడా నాప్రాణాలు ఈ కట్టెవంటి కాయంమీద మమకారంతో ఆయన వెంటపోకుండా నిలిచి ఉన్నాయి. పూర్వజన్మలో ఎట్టిపాడుపనులు చేసినానో కదా నేను!

పరీక్షిత్తు ప్రాణోపవేశము

1-501 ఉరగాధీశ విషానలంబునకు... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఉరగాధీశ విషానలంబునకు మే నొప్పింతు శంకింప నీ
శ్వరసంకల్పము నేడు మానదు; భవిష్యజ్జన్మంబులన్
హరిచింతారతియున్ హరిప్రణుతిభాషా కర్ణనాసక్తియున్
హరిపాదాంబుజసేవయున్ గలుగ మీరర్థిన్ ప్రసాదింపరే.

iBAT సందర్భం

కర్మవశంచేత ధర్మాత్ముడైన పరీక్షిన్మహారాజు శమీకుడనే మహర్షి మెడలో చచ్చిన పామును పడవైచి యింటికి పోయాడు. ఆ మహర్షికొడుకు దానిని చూచి కుళ్ళికుళ్ళి ఏడ్చాడు. కోపం ఆపుకోలేక మా తండ్రిని ఈవిధంగా అవమానించిన పాపాత్ముడు ఏడు రోజులలో తక్షకుని విషపుమంటలో మాడిపోవుగాక అని శపించాడు. అది తెలుసుకుని పరీక్షిత్తు పశ్చాత్తాపంతో తన్ను చూడవచ్చిన మహర్షులతో ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

అయ్యలారా! ఆత్మస్వరూపులారా! నా మనవిని ఆలకించండి. పాములరాజైన తక్షకుని విషం అనే అగ్నికి నా దేహాన్ని సమర్పించుకుంటాను. అందులో ఏమాత్రమూ శంకించను. ఈశ్వరుని సంకల్పం నేడు తప్పకుండా నెరవేరుతుంది. ఇంక ముందుముందు నాకు కలుగబోయే జన్మలు ఏమయినా ఉంటే వానిలో నేను కోరుకొనేది ఒక్కటే. నా మనస్సు హరిని భావించటంలోనే ఆనందం పొందుతూ ఉండాలి. నా వాక్కు శ్రీహరిని కొనియాడటంలోనూ, నా చెవులు శ్రీహరి కీర్తనను ఆలకించటంలోనూ ఆసక్తి కలవై ఉండాలి. నా దేహం శ్రీహరి పాదపద్మాలను నిరంతరం సేవించుకుంటూ ఉండాలి. ఈ మహాభాగ్యాన్ని నాకు మీరు ప్రసాదించండి.