iBam భాగవతం ఆణిముత్యాలు

ఏకాదశ స్కంధం

11-12 ఘనుని శ్రీకృష్ణునిఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఘనుని శ్రీకృష్ణునిఁ గౌస్తుభాభరణునిఁ; గర్ణకుండల యుగ్మ ఘన కపోలుఁ
బుండరీకాక్షు నంభోధరశ్యామునిఁ; గలిత నానారత్న ఘన కిరీటు
నాజానుబాహు నిరర్గళాయుధహస్తు; శ్రీకర బీత కౌశేయవాసు
రుక్మిణీ నయనసరోజ దివాకరు; బ్రహ్మాది సుర సేవ్య పాదపద్ము

(తేటగీతి)

దుష్ట నిగ్రహ శిష్ట సంతోషకరణుఁ
గోటిమన్మథ లావణ్య కోమలాంగు
నార్తజన రక్షణైక విఖ్యాతచరితుఁ
గనిరి కరుణాసముద్రుని ఘనులు మునులు.

iBAT సందర్భం

శుకయోగీంద్రుడు పరీక్షిన్మహారాజునకు యాదవులందరూ బ్రాహ్మణ శాపం వల్ల ఒకరినొకరు కొట్టుకుని చనిపోయారని చెప్పాడు. అంతటి మహానుభావులకు బ్రాహ్మణ శాపం ఎందుకు కలిగింది అని పరీక్షిత్తు అడుగగా దానిని వివరిస్తూ విశ్వామిత్రుడు మొదలైన మహర్షులు శ్రీకృష్ణుని దర్శించడానికి విచ్చేశారని శుకుడు చెప్పాడు. ఆ సందర్భంలో కృష్ణుని దివ్య విభూతిని ఇలా వర్ణిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

శ్రీకృష్ణుడు చాలా గొప్పవాడు. కౌస్తుభమనే మణితో విరాజిల్లుతున్నవాడు.గొప్ప తేజస్సులను వెదజల్లుతున్న కర్ణాభరణములతో అతని చెక్కిళ్ళు ప్రకాశిస్తున్నాయి. తెల్లని కాంతులతో విరాజిల్లుతున్న పద్మాలవంటి కన్నులు ఒప్పారుతున్నాయి. నీలిమేఘం వంటి వన్నెతో శోభిల్లుతున్నాడు. పెక్కు విధాలైన రత్నాలు పొదిగిన కిరీటం శిరస్సు మీద వెలుగులు నింపుతున్నది. మోకాళ్ళ వరకు వ్యాపించి ఉన్న బాహువులు అందంగా ఒప్పారుతున్నవి. చక్రము, గద, ఖడ్గము, మొదలైన ఆయుధాలను ధరించియున్నాడు. ఆ ఆయుధాలకు చొరరాని తావులు లేవు. శోభతో ఒప్పారుతున్న పట్టు పుట్టాన్ని కట్టుకుని ఉంటాడు. రుక్మిణీదేవి కన్నులనే కమలాలకు సూర్యుడైన వాడు. బ్రహ్మ మొదలైన దేవతలందరూ ఆయన పాదపద్మాలను అర్చించి ఆనందమొందుతూ ఉంటారు. కోటి మన్మథుల లావణ్యంతో విరాజిల్లే సుకుమారమైన దేహం కలవాడు. ఆర్తజనులను రక్షించుటయే పరమప్రయోజనమైన విఖ్యాత చరిత్రుడు. అట్టి కరుణాసముద్రుడైన శ్రీకృష్ణుని ఘనులైన మునులు దర్శించుకున్నారు.
11-14 జనములు నిను సేవింపని... (కందము)
iBAA పద్య గానం
iBAP పద్యము
జనములు నిను సేవింపని
దినములు వ్యర్థంబు లగుచుఁ దిరుగుచునుండున్
దనువులు నిలుకడ గా వఁట
వనములలో నున్ననైన వనరుహనాభా!

iBAT సందర్భం

శ్రీ కృష్ణ దర్శనానికి వచ్చిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, నారదుడు మొదలైన మహర్షులు పవిత్రమైన వాక్కులతో అతనిని ప్రశంసిస్తున్నారు.

iBAT తాత్పర్యము

ఓయీ పద్మనాభా! నిన్ను సేవించుకోలేని దినాలు జనాలకు పనికిమాలినట్టివి. ఈ దేహాలు శాశ్వతంగా ఉండవు. అన్ని సంగములను వదిలిపెట్టి అరణ్యాలకు పోయినా తనువులు నిలకడగా ఉండవు కదా!
11-15 తరణంబులు భవజలధికి... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
తరణంబులు భవజలధికి
హరణంబులు దురితలతల కాగమముల కా
భరణంబు లార్తజనులకు
శరణంబులు, నీదు దివ్య చరణంబులిలన్.

iBAT సందర్భం

మహర్షులు శ్రీకృష్ణవాసుదేవుని చరణాల మహిమను ఇలా వర్ణిస్తున్నారు.

iBAT తాత్పర్యము

స్వామీ! సంసారమనేది చాలా పెద్ద సముద్రము. దానిలో పడ్డ జీవుడు తనంత తాను ఒడ్డునకు చేరుకొనలేడు. నీ పాదపద్మాలు అట్టివానికి భద్రమైన నావలవుతాయి. పాపాలు భయంకరంగా అల్లుకున్న బలమైన తీగలు. నీ చరణాలు - వానిని ఛేదించడానికి సమర్థమైన సాధనాలు. వేదాలు పరమాత్మ జ్ఞానాన్ని ప్రసాదించే వాక్వైభవము కల గ్రంధాలు. నీ పాదాలు వానికి ఆభరణాలు. దు:ఖంతో కుమిలిపోయే జనులకు దిక్కైనవి నీ దివ్య చరణాలు. .
11-16 ఒక్కవేళను సూక్ష్మరూపము... (మత్తేభం).
iBAA పద్య గానం
iBAP పద్యము
ఒక్క వేళను సూక్ష్మరూపము నొందు దీ వణుమాత్ర మై
యొక్క వేళను స్థూలరూపము నొందు దంతయు నీవ యై
పెక్కు రూపులుఁ దాల్తు నీ దగు పెంపు మాకు నుతింపఁగా
నక్కజం బగుచున్న దేమన? నంబుజాక్ష! రమాపతీ!

iBAT సందర్భం

జ్ఞానసంపన్నులైన మహర్షుల మహనీయ స్తుతులు ఇంకా ఇలా సాగుతున్నాయి.

iBAT తాత్పర్యము

విశ్వాన్నంతటినీ వీక్షించే విశాలమైన కన్నులతో అలరారు స్వామీ! రమాపతీ! నీవు ఒక్కొక్క సమయంలో అణుమాత్రమైన సూక్ష్మరూపంతో విరాజిల్లుతూ ఉంటావు. కొన్ని వేళలలో సర్వమూ నీవేయై స్థూలరూపంతో ప్రకాశిస్తూ ఉంటావు. నీ ఇష్టాన్ని అనుసరించి పెక్కు రూపాలను పొందుతూ ఉంటావు. నీ మహిమను మేము స్తుతింపగలమా! మాకంతా ఆశ్చర్యముగానున్నది
11-17 శ్రీనాయక నీ నామము... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
శ్రీనాయక! నీ నామము
నానా భవరోగ కర్మ నాశమునకు వి
న్నాణం బగు నౌషధ మిది
గానరు దుష్టాత్ము లకట! కంజదళాక్షా!

iBAT సందర్భం

పరమాత్మ జ్ఞానాన్ని నిలువెల్లా నింపుకున్న వశిష్ఠాది మహర్షులు శ్రీకృష్ణ పరమాత్మను గురించి ఇలా స్తోత్రం చేస్తున్నారు. పరమాత్మ జ్ఞానాన్ని నిలువెల్లా నింపుకున్న వశిష్ఠాది మహర్షులు శ్రీకృష్ణ పరమాత్మను గురించి ఇలా స్తోత్రం చేస్తున్నారు.

iBAT తాత్పర్యము

పద్మదళాక్షా! శ్రీ నాయకా! నీ నామం పెక్కు విధాలైన సంసార రోగాలను కర్మలను నాశనం చేసే శ్రేష్టమైన ఔషధం. చెడిపోయిన బుద్ధి గల నికృష్ట మానవులు ఈ సంగతి తెలియలేరు. అయ్యో! ఎంత ఘోరం!
11-32 అతి పాపకర్ము లైనను... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అతి పాపకర్ము లైనను
సతతము నారాయణాఖ్య శబ్దము మదిలో
వితతంబుగఁ బఠియించిన
చతురులఁ గొనియాడఁ గమలసంభవు వశమే?

iBAT సందర్భం

నారద మహర్షి వసుదేవునకు విదేహ వృషభ సంవాదాన్ని తెలియజేస్తూ ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

మహానుభావా! వసుదేవా! ఎంత ఘోరాతిఘోరమైన పాపాలు చేసినవారైనా ఎల్లవేళలా నారాయణ నామాన్ని వదలకుండా స్మృతిలో నిలుపుకున్నట్లైతే అట్టి నామ జప పరాయణులను కొనియాడడం బ్రహ్మదేవునకు కూడా సాధ్యం కాని పని.
11-42 కరణ త్రయంబు చేతను... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
కరణత్రయంబు చేతను
నరుఁ డే కర్మంబు సేయు నయ్యైవేళన్‌
హరి కర్పణ మని పలుకుట
పరువడి సుజ్ఞానమండ్రు పరమ మునీంద్రుల్‌.

iBAT సందర్భం

ఒకమారు విదేహ మహారాజు దగ్గరకు మహా తపస్సుతో విరాజిల్లే మహర్షులు తొమ్మిదిమంది వచ్చారు. విదేహరాజు వారి గొప్పతనాన్ని కొనియాడి కొన్ని ప్రశ్నలు అడిగాడు. వారు సమాధానం చెప్తూ ఇలా అన్నారు.

iBAT తాత్పర్యము

రాజా! మానవులకు మనసూ, మాట, కాయము అనే మూడు కరణాలు ఉన్నాయి. వీనితో నిరంతరము ఏవో పనులు చేస్తూనే ఉంటారు. అలా చేసే సమయాలలో చేసిన ప్రతి కార్యాన్ని శ్రీహరికే సమర్పణ చేస్తున్నాను అని పలకడం మంచి జ్ఞానం అని మహామునిశ్రేష్ఠులు చెబుతూ ఉంటారు.
11-44 సంతతంబును గృష్ణ సంకీర్తనంబు... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
సంతతంబును గృష్ణ సంకీర్తనంబులు; వీనుల కింపుగ వినఁగవలయు
హర్షంబుతోడుతఁ హరినామ కథనంబు; బాటలఁ నాటలఁ బరఁగవలయు
నారాయణుని దివ్యనామాక్షరంబులు; హృద్వీథి సతతంబు నెన్నవలయుఁ
గంజాక్షు లీలలు గాంతారముల నైన; భక్తి యుక్తంబుగాఁ బాడవలయు

(తేటగీతి)

వెఱ్ఱిమాడ్కిని లీలతో విశ్వమయుని
నొడువుచును లోకబాహ్యత నొందవలయు
నింతయును విష్ణుమయ మని యెఱుఁగవలయు
భేద మొనరింప వలవదు మేదినీశ!

iBAT సందర్భం

మహర్షులు విదేహ మహారాజుకు మూడు కరణాలతో పరమాత్మను సేవించుకునే మార్గాన్ని చక్కగా ఉపదేశిస్తున్నారు.

iBAT తాత్పర్యము

రాజా! శ్రీకృష్ణుని సంకీర్తనాన్ని నిరంతరము చెవులకు ఇంపుగా వింటూ ఉండాలి. పాటలలో, ఆటలలో, మహానందంతో శ్రీహరి నామములను చెప్పుకుంటూ కాలం గడపాలి. శ్రీమన్నారాయణుని దివ్యనామాక్షరాలను హృదయవీథిలో విడువకుండా భావిస్తూ ఉండాలి. భయంకరమైన అడవులలోనైనా శ్రీమహావిష్ణువు లీలలను భక్తినీ కుదురుకొలుపుకుని పాడుకుంటూ ఉండాలి. వెఱ్ఱివారిలాగా విశ్వమంతా నిండిన పరమాత్మను ప్రస్తుతిస్తూ లోకానికి దూరమైపోవాలి. సమస్తమూ విష్ణుమయమని తెలుసుకోవాలి. విష్ణువునకూ, విశ్వానికీ భేదం ఉంది అని అనుకోవడం కూడా పనికిరాదు.
11-46 సర్వభూతమయుం డైన... (తేటగీతి).
iBAA పద్య గానం
iBAP పద్యము
సర్వభూతమయుం డైన సరసిజాక్షుఁ
డతఁడె తన యాత్మయం దుండు ననెడువాఁడు
శంఖ చక్ర ధరుం డంచుఁ జనెడువాఁడు
భక్తిభావాభిరతుఁడు వో భాగవతుఁడు.

iBAT సందర్భం

మహర్షులు నిలువెల్లా జ్ఞానమే అయినవారు కనుక విదేహరాజుతో భాగవతుడు అయినవాని లక్షణాలను వివరిస్తున్నారు..

iBAT తాత్పర్యము

రాజా! పద్మాలవంటి చక్కని నేత్రములు గల శ్రీమన్నారాయణుడు సర్వభూతమయుడు. అంటే విశ్వమంతా విష్ణుమయమే! కాగా అతనిని లోపలా, వెలుపలా కూడా దర్శించుకోవాలి. తన హృదయం లోపలి పొరలలో శంఖము, చక్రము ధరించి సంచరిస్తున్నవాడు సర్వాత్ముడైన పరమాత్మయే అని భక్తి భావంతో ఆనందించే శీలం కలవానిని భాగవతుడు అంటారు.
11-47 వర్ణాశ్రమ ధర్మంబుల... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
వర్ణాశ్రమ ధర్మంబుల
నిర్ణయ కర్మములఁ జెడక నిఖిల జగత్సం
పూర్ణుఁడు హరి యను నాతఁడె
వర్ణింపఁగ భాగవతుఁడు వసుధాధీశా!

iBAT సందర్భం

భాగవతుని లక్షణాన్ని గురించి మహర్షులు విదేహ మహారాజునకు ఇలా వివరిస్తున్నారు.

iBAT తాత్పర్యము

రాజా! మానవులు గుణ కర్మ విభాగాలని బట్టి నాలుగేసి విభాగాలుగా ఏర్పడుతున్నారు. వానిలో మొదటివానిని వర్ణాలని, రెండవవానిని ఆశ్రమాలని అంటారు. ప్రతీ వర్ణానికీ, ప్రతీ ఆశ్రమానికీ, కొన్ని ధర్మాలు, విడివిడిగా ఉంటాయి. వానికి అనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన పనులు కూడా విద్యుక్తంగా ఉన్నాయి. ఎవరికి వారు ఆయా ధర్మాలను పాటిస్తూ ఉండాలి. ఆయా కర్మలను ఆచరిస్తూ ఉండాలి. వానిని చెడగొట్టరాదు. అలా వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా నిర్వహిస్తూ సమస్త జగాలూ నిండిన మహాత్ముడు హరి ఒక్కడే అని పలుకుతూ తదనుగుణంగా ప్రవర్తించే వాడు భాగవతుడు అవుతాడు.
11-51 పరమ బ్రహ్మ మనంగాఁ... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
పరమబ్రహ్మ మనంగాఁ
బరతత్త్వ మనంగఁ బరమపద మనఁగను నీ
శ్వరుఁ డనఁ గృష్ణుఁ డన జగ
ద్భరితుఁడు నారాయణుండు దా వెలుఁగొందున్‌.

iBAT సందర్భం

రాజా! నారాయణ తత్త్వాన్ని వివరిస్తాను, ఆలకించు అని విదేహ మహారాజుతో అంతరిక్షుడనే ఋషివరేణ్యుడు ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

మనం భగవంతుణ్ణి అనేక నామాలతో అర్చిస్తూ ఉంటాం. నామాలెన్నయినా తత్త్వం మాత్రం ఒక్కటే! దానిని దృష్టిలో ఉంచుకుంటే పరబ్రహ్మము అన్నా, పరతత్త్వము అన్నా, పరమపదము అన్నా, పరమేశ్వరుడు అన్నా, కృష్ణుడు అన్నా లోకాలన్నింటియందు నిండియున్న నారాయణుడే ప్రకాశిస్తూ ఉంటాడు.
11-55 హరిదాసుల మిత్రత్వము... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
హరిదాసుల మిత్రత్వము
మురరిపు కథ లెన్నికొనుచు మోదముతోడన్‌
భరితాశ్రు పులకితుం డయి
పురుషుఁడు హరిమాయ గెల్చు భూపవరేణ్యా!

iBAT సందర్భం

విదేహ మహారాజునకు విజ్ఞాన బోధ చెయ్యడానికి వచ్చిన తొమ్మండుగురిలో ప్రబుద్ధుడు అనే మహర్షి ఉత్తమ భాగవతుల ధర్మాలన్నింటినీ వివరించి చెప్పి చివరకు ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

ఉత్తమ నృపాలా! హరిమాయ చాలా గొప్పది. దానిని దాటడం అతి దుష్కరమైన విషయం. కానీ, దానికొక చక్కని దారి ఉన్నది. చెబుతాను విను. నిరంతరమూ హరిదాసులతో చెలిమి చేస్తూ ఉండాలి. శ్రీమహావిష్ణువు కథలను వింటూ ఆనంద పారవశ్యంతో కన్నీరు వదులుతూ దేహమంతా పులకలతో అలరారుతూ ఉండే మానవుడు ఆ హరిమాయను గెలవగలుగుతాడు.
11-61 తారల నెన్నఁగ వచ్చును... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
తారల నెన్నఁగ వచ్చును;
భూరేణుల లెక్కవెట్టఁ బోలును ధాత్రిన్‌;
నారాయణ గుణకథనము
లారయ వర్ణింపలేరు హర బ్రహ్మాదుల్‌.

iBAT సందర్భం

వేదాంత విజ్ఞాన సునిశ్తితార్థులైన మహర్షులలో ఒకడైన ఆవిర్హోత్రుడు అనే మహర్షి పరమాత్మ గుణవైభవాన్ని విదేహ మహారాజునకు వివరిస్తూ ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

తారలన్ = నక్షత్రములను; ఎన్నగన్ = లెక్కబెట్టుట; వచ్చును = వీలగును; భూ రేణులన్ = మట్టి రేణువులను; లెక్కపెట్టన్ = లెక్కించుట; పోలును = వీ లగును; ధాత్రిన్ = భూలోకము నందు; నారాయణ = హరి; గుణ = గుణముల; కథనములు = వృత్తాంతములు; ఆరయ = తరచి చూసిన; వర్ణింపలేరు = వివరించలేరు; హర = పరమశివుడు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదుల్ = మొదలగువారు.
11-72 నవ వికచ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
నవ వికచ సరసిరుహ నయనయుగ! నిజచరణ; గగనచర నది! నిఖిల నిగమ వినుత!
జలజసుత కుచకలశ లలిత మృగమద రుచిర;పరిమళిత నిజహృదయ! ధరణిభరణ!
ద్రుహిణముఖ సురనికర విహిత నుతికలితగుణ!; కటిఘటిత రుచిరచర కనకవసన!
భుజగరిపు వరగమన! రజితగిరిపతి వినుత!; సతత చపరత నియమసరణి చరిత!

(తేటగీతి)

తిమి, కమఠ, కిటి, నృహరి ముదిత! బలి నిహి
త పద! పరశుధర! దశవదన విదళన!
మురదమన! కలికలుష సుము దపహరణ!
కరివరద! ముని, వర, సుర, గరుడ వినుత!

iBAT సందర్భం

ద్రమిళుడు అనే పేరుగల మహాతత్త్వవేత్త విదేహ జనపాలునకు శ్రీమన్నారాయణుని స్తుతించడం పరమ దుష్కరమని తెలియచేస్తూ కమనీయ పదజాలంతో పరవశించి పాడుకోవడానికి అనువుగా ఒక పద్యరత్నాన్ని మనకు అందిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

అప్పుడప్పుడే వికసించిన తామర పూవులవంటి కంటి జంటగల స్వామీ! పాదాలనుండి జాలువారిన పరమ పుణ్యజలాల మందాకినితో సుందరమైన దేవా! సకల వేదాలవినుతులకూ ప్రాతమయిన పరమాత్మా! లోకమాత అయిన లక్ష్మీదేవి పాలిండ్లపై పెట్టుకున్న కస్తూరి వాసనలతో ఘుమఘుమలాడే వక్షస్థలంతో అలరారే జగత్పతి! భూదేవిని ఉర: స్థలంలో పెట్టుకుని పట్టుకున్న కరుణావరుణాలయా! లోకాలన్నింటినీ సృష్టించే బ్రహ్మ మొదలైన దేవతలందరి సన్నుతులకూ యోగ్యమైన గుణ సంపదగల దేవదేవా! నడుమునందు తళుకు బెళుకులతో అలరారుతున్న పచ్చని పటుబట్టతో విరాజిల్లుతున్న విశ్వేశా! మహా సర్పాల దర్పాన్ని రూపుమాపే గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకుని ఆదరించిన దయాసాంద్రా! వెండి కొండపై విరాజిల్లే జ్ఞానమూర్తి శివయ్య స్తోత్రాలకు పాత్రమైన మహాప్రభూ! క్షణమైనా నీ జపాన్ని ఏమరని నియమం గల తాపసుల దారిలో విహరించే జగన్నాయకా! చేపగా, తాబేలుగా, వరాహముగా, నరసింహుడుగా, ఆనందంతో నీ అడుగు తామరను నెత్తికెత్తుకున్న బలిచక్రవర్తిని పరిరక్షించిన వామనుడుగా, గండ్రగొడ్డలితో దుష్టులను శిక్షించిన పరశురాముడిగా, పదితలల పాడు రక్కసుని విదిలించి కొట్టిన వీరశేఖరుడు రాముడుగా అవతరించిన మహాత్మా! మురాసురుని మట్టుపెట్టిన ముకుందా! కలికల్మషాల పొంగులను భంగ పరిచే పరమాత్మా! గజేంద్రునకు వరాలిచ్చిన మహాస్వామీ! మహర్షుల, దేవతల, గరుడుని స్తోత్రాలకు పాత్రమైన పురుషోత్తమా!నమస్తే నమస్తే నమస్తే!
11-95 పరధన పరదార... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
పరధన పరదార పరదూషణాదులఁ; బరవస్తు చింతఁ దాఁ బరిహరించి
ముదిమిచే రోగము లుదయింప కట మున్న; తనువు చంచలతను దగులకుండ
బుద్ధి సంచలతచేఁ బొదలక యట మున్న; శ్లేష్మంబు గళమునఁ జేరకుండ
శక్తియుక్తులు మది సన్నగిల్లక మున్న; భక్తి భావనచేతఁ బ్రౌఢుఁ డగుచు

(తేటగీతి)

దైత్యభంజను దివ్యపాదారవింద
భజన నిజ భక్తి భావనఁ బ్రాజ్ఞుఁ డగుచు
నవ్యయానందమును బొందు ననుదినంబు
నతఁడు కర్మవిముక్తుఁ డౌ ననఘచరిత!

iBAT సందర్భం

భారతంలోని భగవద్గీత వంటిదే భాగవతంలోని ఉద్ధవగీత. ఇక్కడ ఉద్ధవుడు శిష్యుడు. కృష్ణుడే గురువు. ఆ ఉద్ధవుడు వాసుదేవుణ్ణి, ' స్వామీ! మానవుడు మోహ లోభాలను వదలివేసి జనార్దనుని చేరుకునే మార్గం ఏమిటి అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెబుతున్నాడు.

iBAT తాత్పర్యము

పుణ్యమైన నడవడిగల ఓ ఉద్ధవా! ఆలకించు. మానవుడు ఇతరుల ధనాలయందు, ఇతరుల స్త్రీలయందు, ఇతరుల దూషణల మీదా సాధారణంగా కలిగే ఆశలను అభ్యాసంతో తీసివేయాలి. ముసలితనంలో రోగాలు ఏర్పడతాయి. శరీరం స్థిరంగా ఉండదు. బుద్ధికి నిలుకడ ఉండదు. కంఠంలో శ్లేష్మం కమ్ముకుని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దేహశక్తి, మనసు యుక్తీ సన్నగిల్లిపోతాయి. ఈ దురవస్థలు కలుగకముందే భావనలను ఉదాత్తంగా చేసుకుని శ్రీమహావిష్ణువు దివ్యపాదారవిందాల భజనలతో గొప్ప తెలివిని పెంపొందించుకుని ప్రతీక్షణమూ పెరుగుట, తరుగుట, మార్పులను పొందుట అనే వికారాలు లేని ఆనందాన్ని అనుభవించే వ్యక్తి కర్మ బంధాలనుండి విడుదల పొందుతాడు.
11-102 దేహము నిత్యము గా దని... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
దేహము నిత్యము గా దని
మోహముఁ దెగఁ గోసి సిద్ధ మునివర్తనుఁ డై
గేహము వెలువడి నరుఁ డు
త్సాహమునుం జెందు ముక్తిసంపద ననఘా!

iBAT సందర్భం

వాసుదేవుడు ఉద్ధవునికి జ్ఞానబోధ చేస్తూ పింగళ అనే వేశ్య ప్రవృత్తిని వివరించిన తరువాత ముక్తి పొందే విధానాన్ని ఇలా వివరిస్తున్నాడు.

iBAT తాత్పర్యము

పుణ్యాత్మా! ఉద్ధవా! వివేకంతో పరికించి చూస్తే ఒక చక్కని విషయం తెలిసివస్తుంది. దేహం నిత్యం కాదు. ఏదో ఒకనాడు నశించి పోతుంది. దీనిని తెలుసుకోవాలి. పిమ్మట దానియందు పెరిగిపోతూ ఉండే మోహాన్ని తెగగోసివెయ్యాలి. తపస్సులతో సిద్ధిపొందిన మునుల ప్రవర్తనలను చక్కగా అలవర్చుకుని ఇంటినీ, సంసార బంధాలనూ వదలివేసి మానవుడు పరమ ప్రయోజనం పొందడానికి ఉత్సాహంతో ప్రయత్నిస్తాడు. ఫలితంగా ముక్తి సంపదను కైవసం చేసుకుంటాడు.
11-121 నిన్నుఁ జూడని కన్నులు... (తేటగీతి).
iBAA పద్య గానం
iBAP పద్యము
నిన్నుఁజూడని కన్నులు నిష్ఫలములు
నిన్ను నొడువని జిహ్వ దా నీరసంబు
నిన్నుఁ గానని దినములు నింద్యము లగుఁ
గన్నులను జూచి మమ్మును గారవింపు.

iBAT సందర్భం

శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార కృత్యాలనన్నింటినీ చక్కగా నెరవేర్చుకుని తన నిత్య స్థావరమైన వైకుంఠానికి చేరుకున్నాడు. అతని రథసారధి దారుకుడు సర్వప్రాణుల ప్రాణమయుడైన భగవంతుని ప్రాణరహితమైన దేహాన్ని కనుగొని చేతులు జోడించి దు:ఖంతో ఇలా అంటున్నాడు.

iBAT తాత్పర్యము

స్వామీ! సర్వ జగన్నాథా! నిన్ను చూడని కన్నులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే! నిన్ను గూర్చి పలుకని నాలుక రసహీనమయినది. నిన్ను చూడని దినములు నిందకు యోగ్యమైనవి. ఒక్కమారు కన్నులు తెరిచి చూచి మమ్ములను అనుగ్రహించు స్వామీ