iBam భాగవతం ఆణిముత్యాలు

పంచమ స్కంధం

5P-45 పరిపూర్ణుఁడ వై యుండియు... (కందము)
iBAA పద్య గానం
iBAP పద్యము
పరిపూర్ణుడ వై యుండియు,
మఱవక మా పూజలెల్ల మన్నింతువు నీ
చరణారవింద సేవయు,
ధర బెద్దలు చెప్పినటులు దగ జేసెద మౌ

iBAT సందర్భం

నాభి అనే ఒక మహానుభావునకు ఉత్తమసంతానం పొందాలని కోరిక కలిగింది. యజ్ఞపురుషుడైన వాసుదేవుణ్ణి గొప్ప భక్తిశ్రద్ధలతో ఆరాధించాడు. ఆ ఆరాధనలో తన సహధర్మచారిణికి కూడ అవకాశం కల్పించాడు. పుండరీకాక్షుడు తన సుందరరూపాన్ని వారికి అనుగ్రహించాడు. అప్పుడు వారుఆనందపారవశ్యంతో ఇలా అంటున్నారు.

iBAT తాత్పర్యము

దేవా! నీవు పరిపూర్ణుడవు. విశ్వమంతా నీలోనే నిలుపుకొన్న అనంతమైన రూపం కలవాడవు. అయినా ఏమరుపాటు ఏమాత్రమూలేక మమ్మల్నీ, మేము చేసే పూజలనూ మన్నిస్తూ ఉంటావు. ఇంత దయామూర్తివైన నీ చరణారవిందాల సేవను మేము వదలము. అనుభవం పండించుకొన్న ఆత్మారాములు ఉపదేశించిన విధానంతో నీ పాదపద్మాల సేవను మేము నిరంతరమూ చేసుకుంటూనే ఉంటాము. ఔను, ఇది మావ్రతం.
5-1-162 ధరలోన బ్రహ్మంబుఁ... (సీసము).
iBAA పద్య గానం
iBAP పద్యము
ధరలోన బ్రహ్మంబు తపమున దానంబులను గృహధర్మంబులను జలాగ్ని
సోమ సూర్యులచేత శ్రుతులచే నైనను బరమభాగవతుల పాదసేవ
బొందినమాడ్కిని బొందంగ రా దని పలుకదు రార్యులు పరమమునులు
ఘన తపో బాహ్యసౌఖ్యములకు విముఖులునై పుణ్యులు హరిగుణానువాద

(తేటగీతి)

మోదితాత్ములు నగుబుధపాదసేవ
ననుదినంబును జేసిన నంతమీద
మోక్షమార్గంబునకును పద్మాక్షునందు
పట్టువడియుండు నెప్పుడు పరగ బుద్ధి

iBAT సందర్భం

భరతుడనే మహారాజు సహజంగా వైరాగ్యం పొంది బ్రతుకుతున్నాడు. కొన్ని పరిస్థితులలో ఒక దిక్కుమాలిన లేడికి సంరక్షుడయ్యాడు. దానిమీద కొండంత మమకారం పెంచుకున్నాడు. మరణసమయంలో కూడ దానినే స్మరించటంవలన మరుజన్మలో లేడి అయ్యాడు. అయినా వెనుకటి పుట్టుక జ్ఞాపకాలు పోలేదు. ఆ తరువాతి జన్మలో ఒక అవధూతగా పుట్టి రహూగణుడనే రాజుకు ఈవిధంగా తత్త్వబోధన చేశాడు.

iBAT తాత్పర్యము

రాజా! ఈలోకంలో బ్రహ్మజ్ఞానంకోసం తపస్సులూ, దానాలూ, గృహధర్మాలూ చక్కగా చేస్తూ ఉంటారు. అలాగే నీరు, నిప్పు, చందమామ, భాస్కరుడు మొదలైన దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. వేదాలు వల్లిస్తూ ఉంటారు. కానీ పరమభాగవతుల పాదసేవ చేస్తే గానీ బ్రహ్మము పట్టుపడదని మహాత్ములూ, మహర్షులూ పలుకుతూ ఉంటారు. గొప్ప తపస్సుతో సంబంధంలేని సౌఖ్యాల విషయంలో పెడమొగంపెట్టిన పుణ్యాత్ములు శ్రీహరి గుణాలను వదలకుండా పలుకుతూ మహానందం అనుభవిస్తూ ఉంటారు. అట్టి జ్ఞానమూర్తుల పాదసేవను నిత్యమూ చేస్తూ ఉంటే కొంతకాలానికి బుద్ధి మోక్షమార్గానికి కట్టుబడి ఉంటుంది. శ్రీహరిమీద నెలకొని ఉంటుంది.
5-1-176 అక్కట మానుషజన్మం... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
అక్కట! మానుషజన్మం,
బెక్కువ యై యుండు నెపు డభేదమతిం బెం
పెక్కిన యోగిసమాగమ,
మక్కజముగ గలిగెనేని యఖిలాత్ములకున్.

iBAT సందర్భం

ఆంగిరసుని పుత్రుడై పుట్టిన జ్ఞాని భరతుడు అవధూతస్థితిలో రహూగణుడనే రాజునకు ఉత్తమ జ్ఞానవిద్యను ఉపదేశించాడు. దానిని శ్రద్ధగా విన్న ఆ సింధురాజు అవధూతతో ఇలా పలుకుతున్నాడు.

iBAT తాత్పర్యము

ఆహా! స్వామీ! ఈసృష్టిలో అన్నివిధాలవారికి, నేనువేరు, బ్రహ్మమువేరు అనే భావనలేకుండా, ఉన్నది ఒక్కటే అనే జ్ఞానం పూర్తిగా కలిగిన ఆ మహాయోగులతో కలయిక కలిగితే ఆ మానవజన్మయే నిజమైన మానవజన్మ అయి మెచ్చుకొనదగినదవుతుంది
5-2ఆ-55 భారతవర్ష జంతువుల... (ఉత్పలమాల).
iBAA పద్య గానం
iBAP పద్యము
భారతవర్ష జంతువుల భాగ్యము లేమని చెప్పవచ్చు? నీ
భారతవర్ష మందు హరి పల్మఱుఁ బుట్టుచు జీవకోటికిం
ధీరతతోడఁ దత్త్వ ముపదేశము సేయుచుఁ జెల్మి సేయుచు
న్నారయ బాంధవాకృతిఁ గృతార్థులఁ జేయుచునుండు నెంతయున్.

iBAT సందర్భం

పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రుణ్ణి స్వామీ! ఈ భూమి ఏడుద్వీపాలుగా, ఏడు సముద్రాలుగా అయినట్లు చెప్పారు మీరు. ఈ లోకాలను గూర్చి తెలుసుకుంటే లోకేశ్వరుణ్ణి తెలుసుకున్నట్లే. కాబట్టి ద్వీపాలు, వర్షాలు అనేవాని విశేషాలను నాకు తెలియజెప్పండి అని ప్రార్ధించాడు. శ్రీశుకులు ఆ సందర్భంలో భారతవర్షం మహిమను ఇలా అభివర్ణిస్తున్నారు.

iBAT తాత్పర్యము

రాజా! మహాపురుషులు భారతవర్షాన్ని గొప్పగా కొనియాడుతారు. అప్పటివారి మాటలు ఇలా ఉంటాయు. ఆహాహా! భారతవర్షంలో పుట్టిన జంతువుల భాగ్యాలు చెప్ప టానికి మాకు సాధ్యమవుతుందా? ఎందుకంటే ఈ పవిత్రమైన భారతవర్షంలో శ్రీమహావిష్ణువు పెక్కుమారులు అవతరిస్తూ ఉంటాడు. జ్ఞానం పండిన బుద్ధితో ప్రాణికోటులకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. ఆ బోధచేసే సమయంలో ఆ కరుణామయుడు వారిని ఉధ్దరించాలనే తపనతో కొందరితో చెలిమిచేస్తూ ఉంటాడు. మఱికొందరితో చుట్టరికం కలుపుకుంటూ ఉంటాడు. ఆ విధంగా వారిని కృతార్ధులను చేస్తూ ఉంటాడు.
5D-56 తన జన్మకర్మములనుం... (కందము).
iBAA పద్య గానం
iBAP పద్యము
తన జన్మ కర్మములనుం
గొనియాడెడివారి కెల్లఁ గోరిన వెల్లన్
దనియఁగ నొసఁగుచు మోక్షం
బనయముఁ గృపసేయుఁ గృష్ణుఁ డవనీనాథా!

iBAT సందర్భం

శ్రీకృష్ణవాసుదేవుని దయ ఎంతగొప్పదో, శ్రీశుకులు పరీక్షిత్తునకు మనోజ్ఞంగా తెలుపుతున్నారు.

iBAT తాత్పర్యము

రాజా! శ్రీకృష్ణపరమాత్మ భారతవర్షంలో ప్రాణులను ఉద్ధరించటానికి అవతరించాడు. ఆ మహాత్ముడు భూమిలో తాను అవతరించినప్పటి విశేషాలనూ, తాను లోకరక్షణ కోసం చేసిన మహాకార్యాలను శ్రద్ధతో, ఆదరంతో చెప్పుకొనే వారికందరికీ తనివి తీరా కోరినవన్నీ ప్రసాదిస్తాడు. అంతేకాదండయ్యోయ్! ఎంతో పుణ్యం పండించుకొన్న మహనీయులకు, గొప్పతపస్సు చేసిన యోగులు మొదలగువారికి కూడా లభించని మోక్షం కూడా అనుగ్రహిస్తాడయ్యా!